విద్యారంగ సమస్యల పరిష్కారానికి వచ్చిన విద్యార్థులపై అక్రమ అరెస్టులు దారుణం: యుఎస్ఎఫ్ఐ
ప్రభుత్వ అణచివేతతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని చంద్లాపురం మధు హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ యుఎస్ఎఫ్ఐ (USFI) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్లాపురం మధు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేత చర్యలతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయలేరని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని ఆశించిన విద్యార్థులు, తల్లిదండ్రులకు నిరాశే మిగిలిందని ఆయన అన్నారు. “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” పేరుతో భారీగా నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలపై నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. రూ.10 వేల కోట్లకు పైగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు లేకపోవడం, గురుకులాల పరిస్థితి, బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు, పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు కాకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో యుఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చంద్లాపురం మధు హెచ్చరించారు.

