ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తీరుపై టీయూజేఏసీ ఆగ్రహం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యమకారులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు
హైదరాబాద్, (వార్త సంధ్య ):తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ల సాధన కోసం తెలంగాణ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీయూజేఏసీ) ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (కేకే కమిటీ) వ్యవహార శైలిపై టీయూజేఏసీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమకారులను చర్చల ప్రక్రియలో చివరి దశలో చేర్చడం ద్వారా అవమానించారని ఆరోపించారు. కమిటీకి ఎలాంటి కాలపరిమితి నిర్దేశించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కమిటీలో ఉద్యమ సంఘాలకు, మహిళా ఉద్యమకారులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు.
ఉద్యమకారులు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి దరఖాస్తు నమూనా అందుబాటులో ఉంచకపోవడం, ఉద్యమకారులకు కేటాయించాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకు ప్రాథమిక సర్వే నిర్వహించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల పేరుతో ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న సచివాలయం ముట్టడిలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీయూజేఏసీ పిలుపునిచ్చింది.
ఈ మేరకు టీయూజేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది మహేశ్ బాబు చోల్లేటి ఒక ప్రకటనలో తెలిపారు.

