రక్తదానం గొప్పతనాన్ని చాటే “వీరాభిమాని”
గుమ్మడి నరసయ్య చేతుల మీదుగా మూవీ పోస్టర్ ఆవిష్కరణ
ఇల్లెందు, ఆగస్టు 19 (వార్త సంధ్య): రక్తదానం యొక్క గొప్పతనాన్ని, మానవతా విలువలను చాటిచెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న “వీరాభిమాని” సినిమా పోస్టర్‌ను మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ ప్రజా నాయకుడు గుమ్మడి నరసయ్య తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్రబృందం గుమ్మడి నరసయ్యకు కృతజ్ఞతలు తెలిపింది. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన “వీరాభిమాని” చిత్రబృందానికి శుభాభినందనలు తెలిపారు. రక్తదానం వంటి సామాజిక అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కాంబినేషన్‌లో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.
దివంగత దరిపల్లి అనంత రాములు కుమారులైన దరిపల్లి బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషదాయకమని గుమ్మడి నరసయ్య కొనియాడారు. సామాజిక సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.
“వీరాభిమాని” చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు. దరిపల్లి ప్రవీణ్ కుమార్, ఎస్.కె. రెహమాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా, సామాజిక బాధ్యతను ప్రతిబింబించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
చిత్రబృందం మాట్లాడుతూ, పోస్టర్‌ను గుమ్మడి నరసయ్య చేతుల మీదుగా ఆవిష్కరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఆయన అందించిన శుభాకాంక్షలు తమకు ప్రోత్సాహాన్ని అందించాయని పేర్కొంది.

