మా సినిమాను అడ్డుకుంటున్నారు.. అసలైన ‘స్పిరిట్’ టైటిల్ మాదే: నిర్మాత వీకే నరసమ్మ
స్పందించకపోతే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా టీంపై న్యాయపోరాటం:దర్శకుడు
పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలి: నిర్మాత విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 24 (వార్త సంద్య ప్రతినిధి): ‘స్పిరిట్’ సినిమా టైటిల్‌కు సంబంధించి వివాదం చెలరేగింది. తమ చిత్రం ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన తమ సినిమాకు లీగల్ నోటీసులు పంపడం అన్యాయమని నిర్మాత చిన్నబోయిన కె.వి. నరసమ్మ యాదవ్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు వెంకట చెన్నబోయిన రవీందర్ నాథ్‌తో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం నియోజకవర్గం, కొనకనమెట్ల మండలం, పేదలకట్ల గ్రామానికి చెందిన తాను చిన్ననాటి నుంచే సినిమా నిర్మించాలని కలలు కన్నానని నరసమ్మ తెలిపారు. 13 ఏళ్ల వయసు నుంచే సినీ నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్న తాను, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ రెండేళ్ల క్రితం ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ అనే చిత్రాన్ని ప్రారంభించానని చెప్పారు. దాదాపు రెండేళ్లపాటు చిత్రీకరణ కొనసాగించి, సినిమాను పూర్తి చేసి సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందామని వెల్లడించారు.
అయితే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ‘స్పిరిట్’ పేరును గమనించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బృందం తమ వివరాలు సేకరించి లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపిందని ఆరోపించారు. పూర్తిగా చిత్రీకరణ ముగించి, సెన్సార్ ధ్రువీకరణ పొందిన తమ సినిమాను ఈ దశలో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
‘స్పిరిట్’ టైటిల్‌ను ముందుగా తామే నమోదు చేసుకున్నామని, తమ చిత్రానికి అధికారిక సెన్సార్ సర్టిఫికెట్ కూడా లభించిందని పేర్కొన్నారు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న మరో సినిమా కోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైన తమ చిత్రాన్ని నిలిపివేయాలని ప్రయత్నించడం తగదన్నారు. చట్టబద్ధంగా తమకు ఉన్న హక్కులను కాపాడుకునేందుకు అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.
“గొర్లు అమ్మి, బర్రెలు అమ్మి, పొలాలు అమ్మి ఈ సినిమా తీశాం. మా జీవితాల ఆశలను ఈ సినిమాపైనే పెట్టుకున్నాం. ఇప్పుడు మా సినిమా విడుదలను అడ్డుకోవడం వల్ల మేము వీధిన పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రూ.2.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది” అని నరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం రెండు మూడు యూనియన్లు పనిచేస్తున్నాయని, ఒక యూనియన్‌లో టైటిల్ నమోదు చేసుకున్నప్పటికీ దానికి విలువ లేదని చెప్పడం సరికాదన్నారు. రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా అది చెల్లుబాటు కావాలని పేర్కొన్నారు.
ఈ అంశంపై సంబంధిత పక్షాలు నేరుగా చర్చలకు రావాలని కోరినప్పటికీ, చర్చలకు బదులుగా నోటీసులు పంపుతున్నారని విమర్శించారు. తమతో మాట్లాడకుండా ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.
అలాగే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న నిర్మాతల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపాలని కోరారు.
ఇంకా రెండు రోజుల్లోగా సంబంధిత వర్గాలు స్పందించి చర్చలకు రాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ చిత్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ విడుదల చేసి తీరుతామని, తమ సినిమా విడుదలను ఎవరూ అడ్డుకోలేరని నిర్మాత నరసమ్మ యాదవ్, దర్శకుడు రవీందర్ నాథ్ స్పష్టం చేశారు.


