ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిరేపు వైశాఖమాస అంగారక సంకష్టహర చతుర్థి పూజా మహోత్సవం

రేపు వైశాఖమాస అంగారక సంకష్టహర చతుర్థి పూజా మహోత్సవం

📰 Generate e-Paper Clip

శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో ఘనంగా ఏర్పాట్లు

చంద్రోదయం రాత్రి 9:30 గంటలకు – ప్రత్యేక పూజలు
ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత కార్యక్రమాలు
సామూహిక వ్రత ఉద్యాపనకు అవకాశం
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

కామారెడ్డి, మే 04 (వార్త సంధ్య) : వైశాఖమాస అంగారక సంకష్టహర చతుర్థి పూజా మహోత్సవం మే 5, మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చంద్రోదయ సమయం రాత్రి 9:30 గంటలకు ఉండగా, ఆ సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు.

అస్మత్ గురువర్యులు వే.మూ. బ్రహ్మశ్రీ గంగవరం విజయాంజనేయ శర్మ గురుదంపతుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి స్వామి వారికి షోడశోపచార పూజ, ఆరతి, మంత్రపుష్పం, గణపతి హవనం, పూర్ణాహుతి, గోత్రనామార్చనలు జరుగుతాయి.

సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు స్వామివారి ప్రీత్యర్థం విశేష ఫలపంచామృతాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం, అర్ఘ్యప్రధానాలు, వైదిక ఆశీస్సులు, తీర్థప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు అర్చకుల సమక్షంలో ఆలయ కమిటీ, శ్రీ భవానీ మహిళా సేవా సమితి సహకారంతో ఘనంగా జరుగుతాయి.

ఇదే సందర్భంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో సామూహిక సంకష్టహర చతుర్థి వ్రత ఉద్యాపన, వ్రతారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు ముందుగా నమోదు చేసుకోవాలని, రూ.2100 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

పూజలో పాల్గొనే వారు ఉదయం 8:30 గంటలలోపు ఆలయానికి చేరుకోవాలని, పూజా సామగ్రి ఆలయంలోనే అందజేయబడుతుందని పేర్కొన్నారు. భక్తులు పూలదండ, చామంతి పూలు, పండ్లు, తమలపాకులు, టెంకాయ తీసుకురావాలని సూచించారు.

ప్రతీ నెల సంకష్టహర చతుర్థి సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలకు భక్తులు తనమనధన వస్తురూపేణ సేవ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సంకష్టహర మహాగణపతి స్వామి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!