మైనంపల్లి హనుమంతరావుపై మండిపడ్డ దూదిమెట్ల బాలరాజు యాదవ
యాదవులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శ
హైదరాబాద్, జూన్ 22 (వార్త సంధ్య):
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులు జరుగుతున్నాయని, పరిపాలన గాడి తప్పిందని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలరాజు యాదవ్, ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకుడైన కేటీఆర్ తెలంగాణ ఆకాంక్షల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారని గుర్తు చేశారు. కేసీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
మైనంపల్లి హనుమంతరావుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మైనంపల్లి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. సోషల్ మీడియాలో కేటీఆర్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌ను కూడా ఆయన ఖండించారు.
రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోందని విమర్శించిన బాలరాజు యాదవ్, తాజా సర్వేల్లో కాంగ్రెస్ నేతలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తాయని పేర్కొన్నారు.
యాదవ సామాజిక వర్గానికి ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కకపోవడం బాధాకరమని, గతంలో 1983 నుంచి కేసీఆర్ పాలన వరకు యాదవులకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం లభించిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో గొల్ల, కురుమల సంక్షేమం కోసం రూ.7 వేల కోట్ల వ్యయం జరిగిందని తెలిపారు. యాదవులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని, పాత కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని బాలరాజు యాదవ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.
బాల్క సుమన్‌పై అక్రమ కేసులు నమోదు చేశారని, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్‌తో పాటు ఇతరులపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.

