కర్ణాటక ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలంటూ బీఆర్ఎస్ హెచ్చరిక
అవసరమైతే మరోసారి ఆర్డీఎస్ పాదయాత్ర చేపడతామని ప్రకటన
హైదరాబాద్, జూన్ 23 (వార్త సంధ్య): కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై చేపడుతున్న ప్రాజెక్టులు పాలమూరు జిల్లాకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాలమూరును శాశ్వత కరవు జిల్లాగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఖర్చు చేశారని ఆరోపించిన ఆయన, తెలంగాణ ఏర్పాటుకు ముందు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నుంచే కేసీఆర్ పాదయాత్ర ప్రారంభించి పాలమూరు సమస్యలను దేశ దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు.
తుంగభద్ర జలాలపై ఆధారపడిన వేలాది ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందడం లేదని, కృష్ణా నదిపై మరో మూడు బ్యారేజీల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దీంతో జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జూన్, జూలై నెలల్లో కూడా కృష్ణా నదికి నీరు రాకపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల వివాదాల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన శ్రీనివాస్ గౌడ్, కర్ణాటక ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అవసరమైతే మరోసారి ఆర్డీఎస్ నుంచి పాదయాత్ర చేపడతామని, పాలమూరు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి పరోక్షంగా ఎన్‌ఓసీ ఇచ్చినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ ద్వారా గతంలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా అదనపు నీరు అందించే ప్రయత్నాలు చేశారని చెప్పారు.
రాజోలి బండకు ఇరువైపులా బ్యారేజీల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అవి పూర్తయితే రాజోలి బండకు చుక్క నీరు కూడా చేరదని హెచ్చరించారు. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాల కోసం గళం విప్పడం లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాంతానికి చెందిన వారైనా, ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని ఆరోపించిన జైపాల్ యాదవ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

