ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్'​ఉపా' ఉచ్చు వీడేనా..?

‘​ఉపా’ ఉచ్చు వీడేనా..?

📰 Generate e-Paper Clip

రాజేందర్, బద్రిల భవితవ్యంపై నేడే తీర్పు..!

పౌరహక్కుల రక్షణలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి

హైద్రాబాద్/​హనుమకొండ,, వార్త సంధ్య : నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మైనింగ్ అక్రమాలపై కలం ఎత్తిన జర్నలిస్టు ఒకరు.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి గళం వినిపించిన స్కాలర్ మరొకరు. వీరిద్దరిపై మోపిన ‘ఉపా’ (UAPA) కేసులో ఐదేళ్ల ( 4 సంవత్సరాల, 9 నెలల, 2 రోజులు ) సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. హనుమకొండ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ దామెర రాజేందర్, ఓయూ స్కాలర్ కంచర్ల బద్రిల భవితవ్యంపై నేడు (ఈ నెల 5, మంగళవారం) వెలువడనున్న తీర్పుపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం, మేధావుల దృష్టి నిలిచింది.

​2021 ఆగస్టులో నమోదైన ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జర్నలిస్టుగా రాజేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతున్న అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసంపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారు. ముఖ్యంగా ‘స్టాఫ్ బోర్ బ్లాస్టింగ్ – సేవ్ ఎన్విరాన్మెంట్’ అనే పుస్తకం ద్వారా ఆయన మైనింగ్ మాఫియా తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనను, ఓయూ విద్యార్థి నాయకుడు కంచర్ల బద్రిని మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేసి ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు చేశారు. 4 రోజుల పోలీస్ కస్టడీ, 96 రోజుల జైలులో రాజేందర్ ఉండగా, బద్రీ మరి కొన్ని నెలల పాటు జైలు జీవితం గడుపాల్సి వచ్చింది.
ఈ కేసు గత కొన్ని నెలలుగా కోర్టులో ట్రాయల్ నడిచి విచారణ ముగిసింది. నేడు (ఈనెల 5వ తేదీ) తీర్పు వెలువడనుండి. ​ఈ కేసు విచారణలో బాధితుల పక్షం తరఫున సీనియర్ న్యాయవాది పులి సత్యనారాయణ, డాక్టర్ జిలుకర శ్రీనివాస్ వినిపించిన తుది వాదనలు వినిపించారు. కేసులోని కుట్రలను, చార్జీషీట్ లోని కుట్రపూరితమైన సాక్షాలను కోర్టు ముందు తేటతెల్లం చేశారు.

ఈ కేసులో ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఉపా చట్టం వర్తించాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ తప్పనిసరిగా కేంద్రం ప్రకటించిన ‘నిషేధిత జాబితా’ (షెడ్యూల్ – 1) లో ఉండాలి. కానీ, పోలీసులు పేర్కొన్న UCCRI(ML) గానీ, నిర్దిష్టమైన మావోయిస్టు పార్టీ పేరు గానీ ఆ జాబితాలో లేవని న్యాయవాదులు వాదించారు. ఇక మార్కెట్లో బహిరంగంగా లభించే పుస్తకాలను ‘నిషేధిత సాహిత్యం’గా చిత్రించి, బాధితులను సమాజం ముందు తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందని వారు వాదించారు. సామాజిక గొంతుకలను అణచివేయడానికే ‘ఉపా’ వంటి కఠిన చట్టాలను అక్రమంగా ప్రయోగించారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదొవ పట్టించేలా సాక్ష్యాలు ఉన్నాయని వాదించారు.

​అక్రమ మైనింగ్‌పై పోరాడిన జర్నలిస్టుకు, ప్రజాస్వామిక వాదికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇస్తుందా..? లేదా ప్రాసిక్యూషన్ వాదనలు నిలుస్తాయా..? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. “న్యాయవ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం ఉందని, సత్యం గెలుస్తుందని నమ్ముతున్నాం” అని బాధితులు రాజేందర్, బద్రి ధీమా ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ తీర్పుపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ​ఈ తీర్పు కేవలం వ్యక్తుల భవితవ్యాన్ని మాత్రమే కాదు, తెలంగాణలో భావప్రకటనా స్వేచ్ఛ, పౌర హక్కుల స్థితిగతులను కూడా ప్రతిబింబించనుంది. అక్రమ కేసులతో గొంతు నొక్కాలని చూసే శక్తులకు ఈ తీర్పు ఒక స్పష్టమైన సమాధానం చెబుతుందని హక్కుల సంఘాలు ఆశిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!