మాదకద్రవ్యాల నుంచి పిల్లలను, దేశాన్ని రక్షించుకోవాలి
డ్రగ్స్‌కు అలవాటైన విద్యార్థులు ఉంటే విద్యాసంస్థలపై కఠిన చర్యలు
యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ స్టాల్స్ ప్రారంభం



హైదరాబాద్, జూన్ 22 (వార్త సంధ్య ): డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో సోమవారం ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన “యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ స్టాల్స్” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సామాజిక సమస్య మాదకద్రవ్యాలేనని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 26ను అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జూన్ 22 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఒకప్పుడు భారత్ మాదకద్రవ్యాల రవాణాకు మార్గంగా మాత్రమే ఉండేదని, ప్రస్తుతం దేశంలోనే వాటి వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారులు, యువత ఈ మత్తు పదార్థాల బారిన పడటం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
కోవిడ్ అనంతరం దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగిందని, ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిందని చెప్పారు. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గాల్లో దేశంలోకి చేరుతున్న మాదకద్రవ్యాలు పెద్ద నెట్‌వర్క్‌ల ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయని వెల్లడించారు.
డ్రగ్స్ సమస్యలో డిమాండ్, సప్లై రెండూ కీలక అంశాలని, యువతలో డిమాండ్ లేకపోతే సరఫరా కూడా తగ్గిపోతుందని పేర్కొన్నారు. అందుకే విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న డ్రగ్స్
డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి జీవితం మాత్రమే కాకుండా మొత్తం కుటుంబం చిన్నాభిన్నమవుతుందని డీజీపీ అన్నారు. తాను అనేక కేసులు పరిశీలించిన సందర్భాల్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తల కుటుంబాలు కూడా ఈ సమస్యతో తీవ్రంగా నష్టపోయినట్లు చూశానని చెప్పారు.
“వేల కోట్ల ఆస్తులు సంపాదించిన కుటుంబాల్లో కూడా పిల్లలు డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ కూడా తల్లిదండ్రుల బాధ్యత” అని ఆయన అన్నారు.
ఒక్కసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని, కౌన్సెలింగ్, వైద్య చికిత్సలు చేసినప్పటికీ కొన్నిసార్లు పూర్తి స్థాయిలో కోలుకోవడం కష్టమవుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతిని తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించాలని, వారి స్నేహితులు, అలవాట్లు, రోజువారీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. చిన్న వయసులోనే మాదకద్రవ్యాల బారిన పడితే వారి భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు.
పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వారి ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయా అనే అంశాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.
డ్రగ్స్ నిర్మూలనలో అందరి భాగస్వామ్యం అవసరం
డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరిస్తేనే డ్రగ్స్ నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు విమానాశ్రయాలు, చెక్‌పోస్టులు, రైల్వే మార్గాలు, సముద్ర మార్గాల వద్ద పటిష్ట నిఘా అవసరమని తెలిపారు. కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విద్యాసంస్థల కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకురానుందని డీజీపీ వెల్లడించారు. ప్రతి విద్యాసంస్థలో “యాంటీ డ్రగ్స్ అండ్ సేఫ్టీ కమిటీ” ఏర్పాటు తప్పనిసరి చేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థులను స్కూళ్లు, కళాశాలల్లో చేర్పించే సమయంలో తల్లిదండ్రుల నుంచి ప్రత్యేక డిక్లరేషన్ తీసుకునే విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. డ్రగ్స్ నిరోధంలో విద్యాసంస్థలు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యాసంస్థలు ప్రత్యేక స్కౌట్స్ లేదా మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేసుకుని విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటైన విద్యార్థులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్, పునరావాస చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గుర్తింపు రద్దు చేస్తాం
డ్రగ్స్ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఒక విద్యాసంస్థ పరిధిలో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడుతున్నా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ గుర్తింపును కూడా రద్దు చేసే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.
అవగాహన వారోత్సవాలు
“అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం-2026” సందర్భంగా జూన్ 22 నుంచి 26 వరకు మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా టీజీఐసీసీసీలో జూన్ 22 నుంచి 24 వరకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా, టాస్క్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డీ-అడిక్షన్ సెంటర్లు, హైదరాబాద్ సిటీ పోలీస్ వెపన్స్ మరియు డాగ్ స్క్వాడ్ తదితర విభాగాలు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
ఈ స్టాల్స్ ద్వారా మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, నివారణ చర్యలు, పునరావాస సేవలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, భద్రతా వ్యవస్థల గురించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తున్నారు.
కార్యక్రమంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ అజాజుద్దీన్ (ఐఆర్ఎస్), హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ కుందూరు ఎస్‌వీవీ ప్రసాద్ (ఐఆర్ఎస్), విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు.
అనంతరం “సే నో టు డ్రగ్స్” అంశంపై అవగాహన గీతాన్ని రూపొందించిన సునీత కొరపాటిని డీజీపీ సీవీ ఆనంద్ సత్కరించి అభినందించారు.

