ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homebusinessనూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీకి TOMO స్వాగతం

నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీకి TOMO స్వాగతం

📰 Generate e-Paper Clip

మూడు సంవత్సరాల పన్ను రాయితీ కల్పించాలి – సింగిల్ డిజిట్ హోర్డింగ్‌లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి

చిన్న, మధ్య తరహా ఏజెన్సీలకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం అభినందనీయం

ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారు.

 

 

హైదరాబాద్, జూన్ 24 (వార్త సంధ్య): హైదరాబాద్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ (జి.ఓ. నెం.173)ను తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO) హర్షాతిరేకంతో స్వాగతించింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా TOMO అధ్యక్షుడు సయ్యద్ ఇప్తఖార్ మెహ్దీ మాట్లాడుతూ, జి.ఓ. నెం.173 ద్వారా తీసుకొచ్చిన నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ రంగంలో పారదర్శకత, భద్రత, బాధ్యతాయుత నిర్వహణ, క్రమబద్ధమైన నియంత్రణకు కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని అన్నారు. చిన్న, మధ్య తరహా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం అభినందనీయమని పేర్కొన్నారు.

TOMO ప్రధాన కార్యదర్శి కె. రమేష్ మాట్లాడుతూ, పట్టణ ప్రకటనల రంగాన్ని క్రమబద్ధీకరిస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రజల భద్రత, నగర సౌందర్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ స్వాగతించదగ్గదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సమగ్ర మార్గదర్శకాల రూపకల్పనలో భాగస్వాములైన జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి అధికారులను అభినందించారు.

నూతన పాలసీలో భాగంగా వాణిజ్య భవనాలపై గరిష్టంగా జి+4 అంతస్తుల వరకు మాత్రమే రూఫ్‌టాప్ ప్రకటనలకు అనుమతి కల్పించారని, నివాస, వారసత్వ, మతపరమైన భవనాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులపై ప్రకటనలను నిషేధించారని తెలిపారు. ప్రకటన విస్తీర్ణాన్ని గరిష్టంగా వెయ్యి చదరపు అడుగులకు పరిమితం చేయడంతో పాటు అడ్వర్టైజ్‌మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ARC) అనుమతి తప్పనిసరి చేశారని పేర్కొన్నారు.

ప్రైవేట్, వాణిజ్య ప్రాంగణాల్లో యూనిపోల్స్ ఏర్పాటుకు అనుమతి కల్పించడంతో పాటు ప్రధాన కూడళ్లకు వంద అడుగుల దూరంలో, ఫ్లైఓవర్లు, ర్యాంపులకు యాభై అడుగుల పరిధిలో ప్రకటన బోర్డులకు నిషేధం విధించడం రహదారి భద్రతకు దోహదపడుతుందని చెప్పారు. అనుమతి పొందిన ప్రతి నిర్మాణానికి క్యూ ఆర్ కోడ్, జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయడం, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలకు అవకాశం కల్పించడం వల్ల రంగంలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

అయితే, నూతన పాలసీ అమలులో భాగంగా అవుట్‌డోర్ మీడియా రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు పన్ను రాయితీ కల్పించాలని TOMO ప్రతినిధులు కోరారు. సింగిల్ డిజిట్ హోర్డింగ్‌లకు ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హోర్డింగ్‌ల ఏర్పాటు విషయంలో ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

2020లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. సందర్భంగా తమ సమస్యలను వివరించినప్పటికీ స్పందన లభించలేదని, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ఆ మాటను నిలబెట్టుకున్నారని TOMO ప్రధాన కార్యదర్శి కె. రమేష్ తెలిపారు.

“ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఏజెన్సీలు రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తాం. ఇందిరమ్మ పాలనకు మా అండ ఎప్పుడూ ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

TOMO సంయుక్త కార్యదర్శి ఎస్. మధు మాట్లాడుతూ, నూతన మార్గదర్శకాల అమలుతో హైదరాబాద్ అర్బన్ రీజియన్‌లో ఆధునిక, క్రమబద్ధమైన, స్థిరమైన అవుట్‌డోర్ ప్రకటనల వాతావరణం ఏర్పడి నగరాభివృద్ధికి మరింత తోడ్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాలసీ సమర్థవంతమైన అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం, స్థానిక సంస్థలతో కలిసి పనిచేయడానికి తమ సంఘం కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని అవుట్‌డోర్ ప్రకటనలు, మీడియా మౌలిక సదుపాయాల రంగానికి చెందిన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO), ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులతో కలిసి నైతిక, సురక్షిత, స్థిరమైన ప్రకటనల రంగాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర నలుమూలల నుండి ఉన్న పలు ఏజెన్సీ లకు చెందిన వారు హాజరైయ్యారు.

ప్రెస్ మీట్ అనంతరం ప్రెస్సీ క్లబ్ ఆవరణలో సీఎం రేవంత్చి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!