- కాంగ్రెస్ పాలన డిజాస్టర్.. తెలంగాణను తిరోగమనంలోకి నెట్టింది
- బీఆర్ఎస్‌కు 90కి పైగా సీట్లు ఖాయం..
- కేసీఆర్ మా తురుపుముక్క
- సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, వార్త సంధ్య: తెలంగాణ రాష్ట్రానికి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనే మొదటి శత్రువని, తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి దశలోనూ కాంగ్రెస్ ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రస్తావించిన కేటీఆర్, తొలి దశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అణచివేసేందుకు ప్రయత్నించిందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకోవడం నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరపడం వరకు కాంగ్రెస్ అనేక ద్రోహాలకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేసి, అనేక ఉప ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దేశానికి తెలియజేశారని గుర్తు చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో కుట్రలు చేసిందని, చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తిరిగి వెనక్కి తీసుకోవడం వల్ల వందలాది మంది తెలంగాణ యువత ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ అన్నారు.
తెలంగాణను అగ్రస్థానంలో నిలిపింది కేసీఆరే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు కరువు, వలసలతో బాధపడిన తెలంగాణను దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాళేశ్వరం సహా భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు.
నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను నిర్మూలించడం, జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం, గురుకుల విద్యాసంస్థల ద్వారా లక్షలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం వంటి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా సమగ్ర అభివృద్ధి సాధించామని, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలం
అబద్ధపు హామీలు, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. “100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు” అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రైజింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవానికి తెలంగాణను ఫాలింగ్ వైపు నెడుతోందని విమర్శించారు.
అప్పుల విషయంలో కాంగ్రెస్‌కు ఆర్‌బీఐ చెంపదెబ్బ
బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు అప్పుల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆర్‌బీఐ నివేదిక చెంపదెబ్బ కొట్టిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తీసుకున్న అప్పుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే భారీగా అప్పులు తెచ్చిందని ఆరోపించారు. తీసుకున్న అప్పులను అభివృద్ధికి కాకుండా కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కూడా ఎలాంటి ప్రత్యేక సహాయం చేయలేదని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి అదనపు నిధులు కేటాయించలేదని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరిగాయని, భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఉచిత విద్యుత్‌కు రేవంత్ వ్యతిరేకి
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌కు తీవ్ర వ్యతిరేకి అని కేటీఆర్ ఆరోపించారు. గతంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
రేవంత్ ఓటమి ఖాయం.. బీఆర్ఎస్‌కు 90 సీట్లు
ఈరోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 90కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజూ దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
గతంలో కొడంగల్‌లో జరిగినట్లే రానున్న ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. నిజంగా తన నాయకత్వంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
కోమటిరెడ్డి, పొంగులేటి వ్యాఖ్యలపై స్పందన
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వబోమంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ విషయంపై చట్టం తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 72 శాతం కాంట్రాక్టులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ప్రకటించిన 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల హామీని గుర్తు చేస్తూ, ఎన్నికలకు వెళ్లే ముందు ఆ లక్ష్యం పూర్తి చేయాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ మా తురుపుముక్క
కేసీఆర్ ప్రజలకు, పార్టీకి అవసరమైన సమయంలో తప్పకుండా ప్రజల మధ్యకు వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు కేసీఆర్ తురుపుముక్క అని, సరైన సమయంలో ఆయన రంగంలోకి దిగితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మరింత బహిర్గతమవుతాయని అన్నారు.
కాంగ్రెస్‌ను రేవంత్‌నే బొంద పెడతారు
కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేది ప్రతిపక్షాలు కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులు, యువత, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇబ్బందుల కారణంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు ఎలా ఉద్యమించాలో తెలుసని, సరైన సమయంలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ విమర్శలు*
ధాన్యం కొనుగోళ్ల పైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు అలవాటుపడిన కాంగ్రెస్ పార్టీ, రైతన్నల దగ్గర ధాన్యం కొనే తెలివి లేకుండా పోయిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల పైన ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు అన్నీ అవాస్తవమన్నారు. కేవలం ప్రజలను, రైతన్నలను మభ్యపెట్టేందుకే అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
చివరి గింజ దేవుడెరుగు కనీసం తొలి గింజ కూడా కొనే పరిస్థితి లేదన్నారు. 60 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలు దిక్కులు చూస్తూ వర్షానికి ధాన్యాన్ని నష్టపోతున్న పరిస్థితి ఉన్నదన్నారు. కేవలం రైతన్నలను నిండా ముంచి, వారిని ప్రైవేట్ దలార్లకు అమ్ముకునేలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదన్నారు. రైతన్నలకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం మాట దేవుడెరుగు కనీసం సంచులు కూడా సరఫరా చేయలేని సంక్షోభ పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ రైతన్నలను నెట్టిందన్నారు. ఇక రైతన్నలు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని కేటీఆర్ అన్నారు.
*తెలంగాణలో మోడీ, రేవంత్ జోడీ ప్రభుత్వం*
తెలంగాణలో మోడీ మరియు రేవంత్ జోడీ ప్రభుత్వం నడుస్తున్నదన్నారు. అందుకే రేవంత్ రెడ్డి తనతో కలిసి రావాలని ప్రధానమంత్రి మోడీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం మోడీ, రేవంత్‌తో జోడీ కట్టి ఇక్కడ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదన్నారు. తెలంగాణ రైతన్నలకు ఉచిత కరెంటును దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ‘రైతు డిస్కమ్’ పేరిట కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ఒక్క రైతు కూడా అడగకుండానే ఎందుకు రైతు డిస్కమ్ పెడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతు డిస్కమ్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు ప్రారంభిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎలాంటి రైతు డిస్కమ్ లేకుండానే రైతన్నలకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు.
ఏ రైతు అడిగారని రైతు డిస్కమ్ పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ మోటార్లకు మీటర్లు పెట్టే విధానం పట్ల జాగ్రత్తగా ఉండాలని రైతన్నలకు పిలుపునిచ్చారు. ఈరోజు ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు అంటూ రాష్ట్రంలో ఉన్న 5 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు పెడుతూ, వాటి కింద ఉన్న ఆరు మోటార్లకు ఒక మీటర్ను పెడుతున్నదని, త్వరలోనే ప్రతి మోటార్ దగ్గర రేవంత్ రెడ్డి మీటర్ పెట్టబోతున్నాడని హెచ్చరించారు. తెలంగాణ రైతన్నలు పరాహుషార్ అంటూ కేటీఆర్ అలర్ట్ చేశారు.
*విజయాలకు పొంగేది, అపజయాలకు కుంగేది లేదు*
బిఆర్ఎస్ పార్టీకి గెలిచినప్పుడు, ఓడినప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం పాటుపడడమే తెలుసు అని కేటీఆర్ అన్నారు. ఓడినప్పుడు ఆందోళనపడి, గెలిచినప్పుడు ఎగిరిపడేది ఏమీ లేదు అన్నారు. ఆటుపోట్లు రాజకీయాల్లో సహజమని కేసీఆర్ గారు చెప్పినట్లు, విజయం లభించినప్పుడు పొంగిపోకూడదు, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకూడదు అన్న ధైర్యంతోనే, సాహసంతోనే ముందుకు పోతున్నామని, దేశంలోని చాలా తక్కువ రాజకీయ పార్టీలలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ ఒకటి అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయం ఒక గేమ్ అయితే, టిఆర్ఎస్‌కి మాత్రం ఒక టాస్క్ అన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలే పరిష్కారంగా ముందుకు పోతామన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తెలంగాణకి రక్షణ కవచంగా ఉన్నంత కాలం తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను భారతదేశానికి ఒక లైట్ హౌస్‌గా నిలబెట్టుకున్న తీరుగానే, తిరిగి ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకువస్తామన్నారు.
*ఫ్యూచర్ సిటీని ముమ్మాటికీ రద్దు చేస్తాం*
ఫ్యూచర్ సిటీ అనేదే అసలు లేనే లేదనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే స్వయంగా కోర్టులో చెప్పిందని, ఒకవేళ ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలు ఫార్మా సిటీ కోసం, పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రయత్నాలను ఎండగడతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మాటికీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ కేవలం కాంగ్రెస్ పార్టీ తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నదని ఆరోపించారు. ఒకవైపు హైకోర్టులో ఫ్యూచర్ సిటీ లేదు, కేవలం ఫార్మా సిటీ మాత్రమే ఉన్నదని చెప్పిన కాంగ్రెస్, అక్కడ జూ పార్కులకు, ఇతర సంస్థలకు ప్లాట్ల చొప్పున అమ్మాలని చూస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ ー సిటీని ఖచ్చితంగా రద్దు చేస్తామని కేటీఆర్ అన్నారు.
*జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి మోసం*
రెండు వందల కోట్లు… రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు కూడా అందరిలాగే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఫ్యూచరే లేని రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అనే ఒక ఊహాజనిత నగరంలో ప్లాట్లు ఇస్తామని జర్నలిస్టులను మోసం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నిజంగానే జర్నలిస్టుల ఇండ్ల పట్టాలు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికే జర్నలిస్టులకి ఇచ్చిన స్థలంలోనే స్థలాలు కేటాయించాలని, అవసరమైతే మంచిరేవుల లాంటి చోట కూడా, బుద్వేల్ వంటి చోట 100 ఎకరాల (జాగా) కేటాయించాలని సూచించారు.
కానీ కేవలం జూ పార్కుల పక్కన, ఫార్మా ప్లాంట్ల పక్కన జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి జర్నలిస్టు సమాజానికి 100 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారత రాష్ట్ర సమితిదేనని, అందరికన్నా ఎక్కువగా అక్రిడేషన్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా భారత రాష్ట్ర సమితిదేనని కేటీఆర్ గుర్తు చేశారు. జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న మాయమాటలకు లొంగిపోరాదని కేటీఆర్ అన్నారు. రానున్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని, ఇందుకు సంబంధించి జర్నలిస్టులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఖచ్చితంగా వారు సూచించిన చోట ఇండ్లు, స్థలాలు అందజేస్తామన్నారు.

