ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణదళిత క్రైస్తవుల హక్కులు – చలో ఢిల్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రాజ్యాంగ హోదా కల్పించాలి

దళిత క్రైస్తవుల హక్కులు – చలో ఢిల్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రాజ్యాంగ హోదా కల్పించాలి

📰 Generate e-Paper Clip

దళిత క్రైస్తవుల హక్కులు – చలో ఢిల్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రాజ్యాంగ హోదా కల్పించాలి ఆగస్టు 10న జంతర్‌మంతర్‌లో మహాప్రదర్శన, మహాధర్నాకు AIDCRPC పిలుపు హైదరాబాద్, జూలై 23 (వార్త సంధ్య): అణగారిన దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) రాజ్యాంగ హోదా కల్పించాలని, ఈ డిమాండ్ సాధన కోసం ఆగస్టు 10, 2026న దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాప్రదర్శన, మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా AIDCRPC నాయకులు మాట్లాడుతూ, అణగారిన దళిత క్రైస్తవుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా-3ను సవరించడం, సడలించడం లేదా పూర్తిగా తొలగించడం ద్వారా దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు సంబంధించిన ప్రధాన వ్యాజ్యాలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

దళిత క్రైస్తవుల ఎస్సీ రాజ్యాంగ గుర్తింపు హోదాకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని, మత స్వేచ్ఛతో పాటు రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు అందరికీ అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న మహాప్రదర్శన, మహాధర్నాను శాంతియుత, ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవంతం చేయాలని కమిటీ కోరింది. దేశ నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చి తమ ఆకాంక్షలు, మనోభావాలను వ్యక్తపరచాలని, దళిత క్రైస్తవుల ఐక్యత, ఆత్మగౌరవం, శక్తి, సామాజిక సంకల్పాన్ని దేశానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని, అవసరమైన విరాళాలను కూడా ఉదారంగా సమకూర్చాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఈ పిలుపునిచ్చిన వారిలో AIDCRPC వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి చిన్న యోసేపు, జాతీయ ప్రధాన కార్యదర్శి కటారి ప్రసాద్, జాతీయ కోశాధికారి ఉప్పలపాటి జ్ఞానానందం, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి సిరంగి కవిత, కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు శ్రీమతి మల్లేపల్లి శోభావిజయ సామ్రాజ్, దక్షిణ భారత ప్రాంతీయ సమన్వయకర్త రెవ. నర్రా సుధీర్ కుమార్, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి (CRPC) వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ బండి నెల్సన్ విజయ్ కుమార్, మహాజన రాజ్యం పార్టీ (MRP) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బత్తుల విద్యాసాగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులు, న్యాయ సలహాదారు షేక్ అమీన్ పీఠా తదితరులు ఉన్నారు.

దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కుల సాధన కోసం జరుగనున్న ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని AIDCRPC దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!