ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeరాజకీయంమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని బహుజన సేన డిమాండ్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని బహుజన సేన డిమాండ్

📰 Generate e-Paper Clip

దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు.. కోమటిరెడ్డి బ్రదర్స్ క్షమాపణ చెప్పాలి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని బహుజన సేన డిమాండ్

హైదరాబాద్, జూలై 30 (వార్త సంధ్య): రాష్ట్రంలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని బహుజన సేన విమర్శించింది. ముఖ్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ఇటీవల జరిగిన వ్యాఖ్యలు, వ్యవహార శైలి అణచివేత, అవమానకర ధోరణికి నిదర్శనమని పేర్కొంది.

గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో బహుజన సేన నాయకులు మాట్లాడుతూ, రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను తక్కువగా చూడడం, వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దాడులు చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారపూరిత వ్యాఖ్యలు, నియంతృత్వ ధోరణిని వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. తరాలుగా కొనసాగుతున్న అణచివేత భావజాలాన్ని ఇప్పటికీ కొనసాగిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోందని పేర్కొన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి స్వేచ్ఛగా ప్రజల కోసం పనిచేసే హక్కు కలిగి ఉన్నారని, అలాంటి వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బహుజన సేన డిమాండ్ చేసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌తో పాటు దళిత ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది.

అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టి తగిన గుణపాఠం చెబుతామని బహుజన సేన హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!