12 దుకాణాలు దగ్ధం – రూ.50 లక్షల ఆస్తి నష్టం అంచనా
కామారెడ్డి, మే 3 (వార్త సంధ్య):
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందిరా చౌక్ పాత బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్న పాత బస్టాండ్ మూల మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అగ్నిప్రమాదంలో సుమారు 12 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దుకాణాల్లో ఉన్న వస్తువులు మంటల్లో కాలిపోవడంతో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సమయోచిత చర్యల వల్ల మరింత పెద్ద ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

