- టీడబ్ల్యూజేఎఫ్, జీహెచ్‌జేఎచ్‌ఎస్ తీవ్ర ఆగ్రహం
- సచివాలయ సమావేశానికి ఆహ్వానం లేకపోవడంపై నిరసన
హైదరాబాద్, వార్త సంధ్య, మే 06: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (జీహెచ్‌జేఎచ్‌ఎస్), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌జేఎచ్‌ఎస్ అధ్యక్షుడు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన సమావేశానికి తమ సొసైటీని ఆహ్వానించకపోవడం పట్ల వారు మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే కేవలం నాలుగు సొసైటీలకు మాత్రమే ఆహ్వానం ఇచ్చి, తమ సొసైటీని పక్కన పెట్టారని ఆరోపించారు.
2008లో స్థాపించబడిన తమ సొసైటీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సుమారు 1350 మంది జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని, అయినప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. గతంలో కూడా పలు సమావేశాలకు తమ సొసైటీని పిలవలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఖరిపై యుద్ధానికి సిద్ధం
సచివాలయంలో జరిగిన సమావేశ నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్నామని, వాటి ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అయితే కొందరు జర్నలిస్టు నాయకులు తమ సొసైటీపై తప్పుడు సమాచారం అందిస్తూ దూరం పెడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం తమ సొసైటీపై చూపుతున్న వివక్ష, నిర్లక్ష్య వైఖరి కొనసాగితే సభ్యులందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేవలం కొద్ది సొసైటీలకే ప్రాధాన్యం ఇవ్వడం పక్షపాత ధోరణి అని, తమను దూరం పెట్టడం వెనుక ఉన్న శక్తులను బయటపెడతామని హెచ్చరించారు.
జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదని, తమ సభ్యుల హక్కుల కోసం ఎలాంటి పోరాటానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

