ePaper
Saturday, July 11, 2026
📄 ePaper
Homeతెలంగాణఅక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు: యూఎస్‌ఎఫ్‌ఐ

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు: యూఎస్‌ఎఫ్‌ఐ

📰 Generate e-Paper Clip

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో సచివాలయం’ విజయవంతం

రాష్ట్రవ్యాప్తంగా అరెస్టయిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

 

హైదరాబాద్, జూన్ 23 (వార్త సంధ్య): తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమం విజయవంతమైందని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధు అన్నారు.

ఈ సందర్భంగా యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ, కొత్త విద్యా సంవత్సరంలోనైనా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశించినప్పటికీ సమస్యలు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత, నాసిరకం ఆహారం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లకు చేరాయని, వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో విద్యార్థులు, తల్లిదండ్రులను వేధిస్తున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, విద్యార్థులకు అందాల్సిన నిధులు విడుదల కాకపోవడం వల్ల చదువులకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అల్పాహార పథకం ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని, బాసర ట్రిపుల్ ఐటీతో పాటు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు.

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని, టెక్నికల్ విద్య పూర్తిగా వ్యాపారమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేని పాఠశాలలపై శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని, కార్పొరేట్ విద్యాసంస్థలకు పోలీసు యంత్రాంగం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారని, దీనిపై ఏసీబీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

‘ఛలో సచివాలయం’ కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్, సిద్ధిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్లాపురం మధు, రాజేష్ నాయక్, వెంకటేష్, సందీప్, సహాయ కార్యదర్శులు గణేష్, శేఖర్, రాకేష్‌తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని యూఎస్‌ఎఫ్‌ఐ నేతలు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!