ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeతెలంగాణరాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోంది: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోంది: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

📰 Generate e-Paper Clip

సింగూరు జలాశయంలో భూకబ్జాలపై విచారణ జరిపి అనిల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్..

బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని హెచ్చరిక

హైదరాబాద్, తెలంగాణ భవన్: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

రాష్ట్రంలో ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని, వాటి ధరలు భారీగా పెరిగాయని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ విప్‌లు విమర్శలకే పరిమితమవుతున్నారని, కాంగ్రెస్ నాయకుల వద్ద సరుకు లేదని, సబ్జెక్టు లేదని విమర్శించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పనిచేస్తారని, కేటీఆర్, హరీశ్ రావులను విమర్శించే స్థాయి కాంగ్రెస్ విప్ విజయరమణరావుకు లేదన్నారు.

 

అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, వారు “మైకాసురులు, భూబకాసురులు”గా మారారని వ్యాఖ్యానించారు. సింగూరు జలాశయం కబ్జాలకు గురవుతోందని, మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది అనిల్ రెడ్డి జలాశయ పరిధిలో భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం ఎకరం మాత్రమే కబ్జా జరిగిందని అధికారులు చెబుతున్నారని అన్నారు.

 

అనిల్ రెడ్డికి సింగూరు జలాశయం సమీపంలో ఫామ్ హౌస్ ఉందని, నిజాం కాలంలో నిర్మించిన కుంటలను చదును చేసి ఆక్రమించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కలెక్టర్‌కు అందజేసినా చర్యలు తీసుకోవడం లేదని, మంత్రి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని విమర్శించారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని, ఈ అంశంపై కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

 

సింగూరు జలాశయానికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల భూములకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించిన చంటి క్రాంతి కిరణ్, మంత్రి దామోదర రాజనర్సింహ వాస్తవాలను బయటపెడితే తట్టుకోలేక కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.

 

సోషల్ మీడియాలో వాస్తవాలు బయటపెడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి ఒత్తిళ్ల కారణంగా తమ కార్యకర్త అశోక్‌పై మఫ్టీలో ఉన్న పోలీసులు దాడి చేసి జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. పోలీసులు చేసిన చర్యలను మంత్రికి వీడియో కాల్ ద్వారా చూపించారని, తాము ఆరు గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన తరువాతే అశోక్‌ను విడుదల చేశారని చెప్పారు.

 

మంత్రి దామోదర రాజనర్సింహ తన అరాచకాలను నిలిపివేయాలని, మంత్రి చెప్పిన ప్రతి విషయానికి తలూపుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారులు తమ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. పోలీసులు చట్టప్రకారం వ్యవహరించకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని చంటి క్రాంతి కిరణ్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!