పోడు రైతుపై ఒత్తిడి… రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత
డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో మెరుపు ఆపరేషన్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):
జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన మెరుపు దాడిలో అటవీ శాఖకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పోడు రైతును వేధించకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గుండాల మండలం నడిమిగూడెం సెక్షన్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నరేష్, సాయనపల్లి గ్రామానికి చెందిన ఓ పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు రూ.10,000 లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పన్నిన వ్యూహం ప్రకారం గురువారం నరేష్ నగదు స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఆపరేషన్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, లంచంగా స్వీకరించిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వై. రమేష్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజల్లో అవినీతిపై అవగాహన పెరుగుతోందని తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.ఈ ఘటనతో ప్రభుత్వ విభాగాల్లో అవినీతిపై ఏసీబీ కఠినంగా వ్యవహరిస్తోందనే సందేశం స్పష్టమైంది.

