భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : కొంగరకలాన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘గిరిదర్శక్’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలను ప్రత్యేక దృష్టి ఉన్న జిల్లాలుగా గుర్తించిన నేపథ్యంలో, గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పర్యాటక కేంద్రాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం ‘గిరిదర్శక్’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమం తొలి విడతలో భాగంగా 10 మంది యువకులను ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

