మిగిలిన డ్రైనేజీ, రోడ్ల పనులు పూర్తి చేస్తామని హామీ
నాగోల్ డివిజన్, ఏప్రిల్ 29 (వార్త సంధ్య) : నాగోల్ డివిజన్ పరిధిలోని రామాంజనేయ కాలనీవాసుల అభ్యర్థన మేరకు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో దాదాపు రూ.66 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు మంజూరు చేసి పూర్తి చేయించడంతో సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యాయని కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఇంకా సుమారు 70 మీటర్ల మేర డ్రైనేజీ లైన్ పనులు మిగిలి ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కాలనీలో మంచినీటి సదుపాయం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, కొన్ని గల్లీలలో కొత్తగా వాటర్ లైన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ కాలనీవాసుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి మిగిలిన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికి కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు చిరంజీవి, సతీష్ యాదవ్, శిల్పారెడ్డి, సీతారాములు, రమేష్, పోచంపల్లి రాజేందర్ రెడ్డి, అలాగే కాలనీవాసులు సత్తిరెడ్డి, వెంకట రాములు, రవి, రాంచందర్, ప్రేమ్ కుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

