బ్రేకింగ్ న్యూస్
శాస్త్రీయ దర్యాప్తుతో మహిళ హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ బి. నరహరి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిరంతర గాలింపు ద్వారా నిందితుడిని అరెస్ట్ చేశాయి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 18 ( వార్తా సంధ్య)
పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం శ్యామల అదృశ్యమైన కేసు దర్యాప్తులో భాగం
గా, గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన లభించిన మృతదేహాన్ని శ్యామలగా గుర్తించారు. తలపై తీవ్ర గాయాలు ఉండటంతో కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
దర్యాప్తులో పిట్ట నర్సింలు @ పిట్టల నర్సింలు (శిరాన్‌పల్లి, నవీపేట్ మండలం, నిజామాబాద్ జిల్లా)ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. శ్యామలతో పరిచయం ఉండగా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అసూయతో రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించాడు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను రూ.200లకు విక్రయించి, రక్తపు మరకలున్న బట్టలను మార్చి పరారైనట్లు తెలిపాడు.
విచారణలో నిందితుడిపై గతంలో నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు, బాసర పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదై జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైనట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్లిష్టమైన కేసును ఛేదించిన టౌన్ సీఐ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, కానిస్టేబుళ్లు కమలాకర్, రామస్వామి, సంపత్, రాజులను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు అపరిచిత వ్యక్తులతో నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లొద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

