జిల్లా గ్రంథాలయంలో సాయికుమార్ కు ఘన సన్మానం
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 29 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమై ఇండియన్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (దక్షిణ మధ్య రైల్వే) ఉద్యోగాన్ని సాధించిన సీహెచ్ సాయికుమార్‌ను జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి అభినందిస్తూ, ఆయన సాధించిన విజయాన్ని గ్రంథాలయానికి గర్వకారణంగా అభివర్ణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమార్ తండ్రి నిత్యకూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారని, అలాంటి పరిస్థితుల్లోనూ విద్యనే ఆయుధంగా భావించి, ఉద్యోగమే లక్ష్యంగా నిరంతర శ్రమతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమని వీరబాబు అన్నారు. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాయికుమార్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రంథపాలకురాలు జి. మణి మృదుల మాట్లాడుతూ, సాయికుమార్ క్రమశిక్షణ, వినయ విధేయతలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్రంథాలయానికి వచ్చి అందుబాటులో ఉన్న పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేస్తూ, లక్ష్యసాధన కోసం అంకితభావంతో శ్రమించారని తెలిపారు. అలాంటి పట్టుదలే ఆయన విజయానికి కారణమైందని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయరచయిత చిరంజన్, చార్టర్డ్ అకౌంటెంట్ వాసు, గ్రంథపాలకురాలు జి. మణి మృదుల, గ్రంథాలయ సిబ్బంది, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠకులు పాల్గొని సాయికుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగం సాధించిన ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

