- ఉప్పల్ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలన్న సంఘం
- వంజరి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరింపు
- ట్రస్టు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని విజ్ఞప్తి
- ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అఖిల భారత వంజరి సేవా సంఘం డిమాండ్
హైదరాబాద్, వార్తసంధ్య, జూన్ 6:
తెలంగాణలో వంజరి కులస్తులకు గతంలో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదాను పునరుద్ధరించాలని, తక్షణ ఉపశమన చర్యగా వారిని డి.ఎన్.టి (డీనోటిఫైడ్ ట్రైబ్స్)గా గుర్తించాలని అఖిల భారత వంజరి సేవా సంఘం, తెలంగాణ వంజరి సేవా సంఘం ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే వంజరి కుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి.
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, 1978 వరకు ఎస్టీలుగా గుర్తింపు పొందిన వంజరి కులస్తులను ఒక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా బీసీ-డి వర్గంలోకి మార్చడం వల్ల గత ఐదు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణనలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, వంజరి కులస్తులకు న్యాయం చేయాలని కోరారు.
ఆర్థికంగా వెనుకబడిన వంజరి కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి, విద్య, సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
వంజరి కుల ఆరాధ్య సంత్ భగవాన్ బాబా పుణ్యతిథిని అధికారికంగా నిర్వహించాలని, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గోపీనాథ్ ముండేకు భారతరత్న పురస్కారం ప్రకటించి ఆయన జయంతి, వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 7న ఉప్పల్ బాగాయత్‌లో నిర్మించిన వంజరి కుల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు వంజరి కుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంఘ నాయకులు కోరారు.
వంజరి కుల ఆత్మగౌరవ భవనం పూర్తిగా కులస్తుల విరాళాలతో నిర్మించబడిందని, గత ప్రభుత్వం ప్రకటించిన రూ.1 కోటి నిధులు ఇప్పటికీ విడుదల కాలేదని తెలిపారు. భవన అభివృద్ధి, మౌలిక వసతుల కోసం అదనంగా రూ.5 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా భవన నిర్మాణ ట్రస్టులో బీసీ సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం అన్ని నమోదిత వంజరి సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, పదవీకాలం ముగిసినా కొనసాగుతున్న వ్యక్తుల ఆధిపత్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో సాల్వేరు కృష్ణ, ఎదుగని శంకర్ నారాయణ, ఎరుగని హరినాథ్, ధాత్రికా కాశీనాథ్, యుగంధర్, కాలేరు సురేష్, ఎదుగని వెంకటేష్, శివప్రసాద్, రత్నం సంతోష్, అముద లక్ష్మణ్, మహదేవ్ ముండే తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు.

