కారు ప్రమాదం కారణంగా మధుయాష్కి గౌడ్ భారత్ పర్యటన వాయిదా
ఎల్బీనగర్, జూన్ 4 (వార్త సంధ్య): టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మధుయాష్కి గౌడ్ సతీమణి డాక్టర్ సుచి గౌడ్ అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో స్వల్ప గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమె త్వరగా కోలుకోవాలని చంపాపేట్, కర్మన్‌ఘాట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గురువారం కర్మన్‌ఘాట్ పురాతన ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోగతాల విజయ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 51 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే మధుయాష్కి గౌడ్ కుటుంబానికి ఈ ప్రమాదం కలిగించిన బాధపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ సుచి గౌడ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే మధుయాష్కి గౌడ్ త్వరలోనే భారత్‌కు చేరుకుని ప్రజాసేవలో పాల్గొనాలని ధ్యానాంజనేయ స్వామిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ధ్యానాంజనేయ ఆలయ డైరెక్టర్ పూల నాగరాజు, ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శి మేకల రాజశేఖర్ రెడ్డి, నోముల రవీందర్ గౌడ్, బుదారపు గోపాల్ ముదిరాజ్, జక్కా సందీప్, చింటూ వెంకట్, నవీన్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, మధుయాష్కి గౌడ్ గురువారం భారత్‌కు రావాల్సి ఉండగా, సుచి గౌడ్ ప్రమాదం కారణంగా తన ప్రయాణాన్ని మరికొన్ని రోజులు వాయిదా వేసుకున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. సుచి గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు.

