కేపీహెచ్‌బీలో పోలీసుల తనిఖీలు.. ₹30 లక్షల నగదు స్వాధీనం
టెలిగ్రామ్ ద్వారా క్రికెట్ ప్రెడిక్షన్లు.. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం
ముగ్గురు నిందితుల అరెస్ట్.. ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
వార్త సంధ్య, కూకట్‌పల్లి :కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘ఇండిస్ వన్ సిటీ’ అపార్ట్‌మెంట్‌లో కిడ్నాప్ జరుగుతోందంటూ డయల్-100కు వచ్చిన ఒక ప్రాంక్ కాల్‌ను ఛేదించిన పోలీసులు, ఏకంగా ఒక ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ దాడిలో ₹30,00,000 నగదుతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
కేపీహెచ్‌బీ పరిధిలోని ఇండిస్ వన్ సిటీలో ఒకరిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు డయల్-100 ద్వారా సమాచారం అందింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే, ఆ కాల్ కేవలం ప్రాంక్ కాల్ అని తేలింది. అదే సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఫ్లాట్‌లో పంచుల సమక్షంలో సోదాలు నిర్వహించగా ఆన్‌లైన్ బెట్టింగ్ భాగోతం బయటపడింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు దేసినేని సుమంత్ (25), మకాటి మనోజ్ (29), కనుమూరి గౌతమ్ చౌదరి (29)గా గుర్తించారు. వీరు టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా క్రికెట్ ప్రెడిక్షన్లు (అంచనాలు) ఇస్తూ, కమిషన్ ప్రాతిపదికన వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నట్లు నిర్ధారణ అయింది.
ఎస్‌ఐపి కె. రాజు అందించిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.

