రక్తదానం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
వార్త సంధ్య, కూకట్పల్లి: : కూకట్పల్లి వివేకానంద నగర్లోని సుఖశాంతి భవన్లో రేడియేషన్ ఎఫెక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ (RERF), రాజయోగ మెడిటేషన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బ్రహ్మకుమారి సోదరీమణుల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు రక్తదాతలను నేరుగా కలిసి వారి సేవా నిరతిని అభినందించారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంలో రక్తదానం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం శిబిర నిర్వాహకులను అభినందించిన ఆయన, సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ప్రతినిధులు, ఆర్ఈఆర్ఎఫ్ సభ్యులు, రాజయోగ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు, స్థానిక నాయకులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

