- రూ. లక్ష కోట్ల విలువైన భూములను బడాబాబులకు కట్టబెట్టే కుట్ర
- సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాల్లో ఉన్నారని ఆరోపణ
- భూకబ్జాలపై ఆధారాలతో వరుసగా బహిర్గతం చేస్తామని వెల్లడి
- శిఖం భూములు కొన్న పవన్ కళ్యాణ్ వెంటనే భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్
- తెలంగాణ వనరులు, భూముల రక్షణ కోసం భూపోరాటాలు, లీగల్ ఫైట్ చేస్తామని స్పష్టం
హైదరాబాద్, జూన్ 6 (వార్త సంధ్య): రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రస్తుత ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తూ పెద్దలకు లబ్ధి చేకూర్చే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాల్లో పాల్గొంటున్నారని ఆరోపిస్తూ, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
తెలంగాణ వనరులు, సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడేందుకే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భూముల రక్షణ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసం తెలంగాణ భూములను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
హైడ్రా పేరుతో పేదల భూములను ఖాళీ చేయిస్తున్నారని, అయితే పెద్ద పెద్ద నిర్మాణాల విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కూకట్‌పల్లిలోని మంజీర కాలనీలో పేదలపై చర్యలు తీసుకుంటూ, మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రేమవతిపేట పెద్ద చెరువు పరిధిలో భూకబ్జాలు జరిగాయని, చెరువు భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల వద్ద కూడా భూముల ఆక్రమణలు జరిగాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై అధికారిక ఫిర్యాదులు చేయనున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న 10 ఎకరాల శిఖం భూమిపై కూడా కవిత స్పందించారు. ఆ భూమి ప్రభుత్వ రికార్డుల ప్రకారం శిఖం భూమిగా గుర్తించబడిందని, వెంటనే ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన విధంగానే ఆయనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల హక్కులు, వనరుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న భూకబ్జాలు, అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోమన్నారు.
నీటి వనరుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా-గోదావరి జలాల అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

