- మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్ల పరిశీలన
- ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జూన్ 7 (వార్త సంధ్య): మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు పంపిణీ చేసే చేప ప్రసాద కార్యక్రమానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్న చేప ప్రసాద పంపిణీ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బ్యారికేడ్లు, క్యూలైన్లు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, షాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రులు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. వేసవి ఉక్కపోత దృష్ట్యా క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమం ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకుంటూ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు.
నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అంబులెన్సులు, మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సీపీఆర్ బృందాలను క్యూలైన్ల మధ్య ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు సమాచారం అందించే మైక్ వ్యవస్థలో స్పష్టమైన ఆడియో ఉండేలా చూడాలని, అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను మోహరించాలని, పిక్‌పాకెట్ ఘటనలు జరగకుండా అవగాహన కల్పించాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి ఏడాది మాదిరిగానే స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహారం అందించేలా సమన్వయం చేయాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా మృగశిర కార్తె ఉదయం సమయంలో వస్తుందని, ఈసారి రాత్రి 9 గంటలకు ప్రారంభం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జూన్ 9వ తేదీ రాత్రి వరకు నిరంతరంగా చేప ప్రసాద పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు వసతి, ఆహారం తదితర సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. అవసరమైన చేప పిల్లలను సిద్ధంగా ఉంచామని, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలు, వైద్య సేవల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
చేప ప్రసాదంపై వందల ఏళ్లుగా ప్రజల్లో విశ్వాసం కొనసాగుతోందని, ఆ విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

