- చెక్ పవర్ రద్దు చేస్తే గ్రామ పాలనలో పారదర్శకత దెబ్బతింటుందని ఆందోళన
- ఉపసర్పంచ్‌లకు రూ.5000 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3000 వేల వేతనం డిమాండ్
- జూన్ 25న ‘హలో ఉపసర్పంచ్ – ఛలో హైదరాబాద్’ మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా పిలుపు

హైదరాబాద్, జూన్ 15 (వార్త సంధ్య): ఉపసర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ హక్కులను కాపాడితే పాలాభిషేకం చేస్తామని, లేకపోతే నిరసనాభిషేకం తప్పదని హెచ్చరించారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉపసర్పంచ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది ఉపసర్పంచ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి నిధుల పారదర్శక వినియోగం కోసం 2018 పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఉపసర్పంచ్‌లకు కల్పించిన చెక్ పవర్‌ను తొలగించడం గ్రామ పాలన వ్యవస్థను బలహీనపరచడమేనని అన్నారు.
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చెక్ పవర్ కీలకమని పేర్కొన్నారు. దీనిని రద్దు చేయడం ద్వారా అధికారుల అవినీతికి అవకాశం కల్పించినట్లవుతుందని ఆరోపించారు. గ్రామాల్లో సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు కూడా ప్రజాప్రతినిధులేనని, వారికి తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల వేతనాలు పెంచగలిగే ప్రభుత్వం ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల గౌరవ వేతనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని ప్రశ్నించారు. ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5000 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3000 వేల గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల పేర్లను కూడా పొందుపరచాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం యువతకు ఆదర్శమని పేర్కొన్న బొట్ల కార్తీక్, యువ రాజకీయ నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చెక్ పవర్ తొలగిస్తే గ్రామీణ యువతలో రాజకీయాల పట్ల విరక్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉపసర్పంచ్‌లకు ప్రత్యేక ఛాంబర్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా “హలో ఉపసర్పంచ్ – ఛలో హైదరాబాద్” పేరుతో జూన్ 25న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ ధర్ణాచౌక్లో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రతి ఉపసర్పంచ్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
జూన్ 25లోపు ప్రభుత్వం చెక్ పవర్‌పై వస్తున్న వార్తలను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అవసరమైతే విద్యార్థి సంఘాల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, తమ హక్కుల కోసం ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ స్వప్న, ఉపాధ్యక్షురాలు కవిత, ఫోరం కమిటీ సభ్యులు, వివిధ జిల్లాలకు చెందిన ఉపసర్పంచ్లు పాల్గొన్నారు.

