ePaper
Wednesday, April 15, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCఆటోలో కల్తీ నూనె తరలింపు

ఆటోలో కల్తీ నూనె తరలింపు

📰 Generate e-Paper Clip

హోటళ్ల నుంచి వాడిన నూనె సేకరణ – 30 డబ్బాలతో అక్రమ రవాణా

జర్నలిస్టుల అప్రమత్తతతో బయటపడిన దందా –

ఫుడ్ సెక్యూరిటీ, జిహెచ్ఎంసి అధికారుల కోసం పోలీసుల ఎదురుచూపులు

ఉప్పల్, ఏప్రిల్ 01; (వార్త సంధ్య):
హైదరాబాద్ నగరంలో కల్తీ వంటనూనె దందా మరింత విస్తరిస్తోందనే అనుమానాలను బలపరిచే ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా హోటళ్లలో వాడిన నూనెను తిరిగి మార్కెట్‌లోకి పంపించే అక్రమ వ్యవహారం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే, నగరంలోని పలు హోటళ్లలో వాడి పారేసిన వంటనూనెను సేకరించి మళ్లీ విక్రయించేందుకు కొందరు దందాదారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 15 లీటర్ల సామర్థ్యం గల సుమారు 30 డబ్బాల్లో నింపిన వాడిన నూనెను టీఎస్07 యూహెచ్ 1643 నంబర్ గల ఆటోలో తరలిస్తుండగా అటుగా వెళ్తున్న జర్నలిస్టులు అనుమానంతో వాహనాన్ని ఆపారు.
డబ్బాల్లో ఉన్న నూనె పూర్తిగా వాడిపోయి నల్లగా మారినట్లు గుర్తించిన జర్నలిస్టులు వెంటనే అత్యవసర సహాయ నంబర్ 100కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ నూనె ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న ముఠా ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాడిన నూనెను శుద్ధి చేసినట్లు చూపించి తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం:
కేసు నమోదు అనంతరం స్వాధీనం చేసుకున్న నూనె నమూనాలను పరిశీలించేందుకు ఉప్పల్ పరిధిలోని ఆహార భద్రత అధికారిని పోలీసులు సంప్రదించినట్లు తెలిసింది. అయితే సంబంధిత అధికారి “నేను సెలవులో ఉన్నాను” అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో కేసు విచారణలో ఆలస్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, నూనె నాణ్యత పరీక్ష కోసం మరోసారి ఫోన్ చేయగా తాను ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో (లైవ్‌లో) ఉన్నానని, ఇతర అధికారులను సంప్రదించాలని సూచించిన ఘటన కొసమెరుపుగా మారింది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అత్యవసర అంశంలో బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఇక జీహెచ్ఎంసి (మహానగర పాలక సంస్థ) అధికారులను కూడా పోలీస్ స్టేషన్‌కు రప్పించి సంయుక్తంగా విచారణ జరపాలని ఉప్పల్ ఎస్సై ప్రయత్నిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారుల రాక కోసం పోలీసులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

ప్రజారోగ్యంపై ముప్పు:

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వాడిన వంటనూనెను మళ్లీ వినియోగించడం వల్ల జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తక్కువ ధరకు అమ్మే ఆహార పదార్థాల ద్వారా ఈ నూనె ప్రజలకు చేరే అవకాశం ఉండటం మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

కఠిన చర్యలపై డిమాండ్:

నగరంలో కల్తీ ఆహార పదార్థాల దందాపై సంబంధిత శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోటళ్లలో వాడిన నూనెను సురక్షితంగా నిర్వాహణ చేయాలనే నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.
ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో అధికారుల నిర్లక్ష్యం సహించరానిదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!