ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలు – ఇద్దరు అరెస్ట్ పరారీలో మరో నిందితుడి...

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలు – ఇద్దరు అరెస్ట్ పరారీలో మరో నిందితుడి కోసం గాలింపు

📰 Generate e-Paper Clip

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలు – ఇద్దరు అరెస్ట్

 

రూ.15 వేల నగదు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం

 

పరారీలో మరో నిందితుడి కోసం గాలింపు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 31 ( వార్తా సంధ్య )

 

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో వాట్సాప్ లింకులు పంపించి ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వెల్లడించారు.

 

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.

 

విచారణలో ప్రధాన నిందితుడు భూక్య నవీన్ అలియాస్ నరేష్ (26) విదేశాల్లో ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన సమయంలో “ఫ్యూచర్ 9 కం” అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు, మొబైల్ నంబర్ల డేటాను సేకరించినట్లు వెల్లడించాడు. అనంతరం భారత్‌కు వచ్చాక వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

 

నిందితులు బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టించే వారని, నేరుగా చెల్లింపులు సాధ్యం కానప్పుడు తమ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు స్వీకరించి వెబ్‌సైట్‌లో జమ చేసేవారని పోలీసులు తెలిపారు. ఇందుకు వారికి ఐదు శాతం కమిషన్ లభించేదని విచారణలో బయటపడింది. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

ఈ కేసులో అరెస్టయిన వారు భూక్య నవీన్ అలియాస్ నరేష్ (26), భూక్య ప్రవీణ్ (23). ఇద్దరూ రామారెడ్డి మండలానికి చెందినవారు. వారి వద్ద నుంచి హెచ్‌పీ ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

 

ఈ కేసును ఛేదించిన కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్  పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

 

 

ప్రజలకు ఎస్పీ సూచనలు

 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ప్రజలకు కీలక సూచనలు చేశారు:

 

– ఆన్‌లైన్ గేమింగ్, ట్రేడింగ్, పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, క్యాష్‌బ్యాక్, రెట్టింపు లాభాలు వంటి పేర్లతో వచ్చే గుర్తు తెలియని వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా లింకులను క్లిక్ చేయవద్దు.

– ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌లో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయతను పూర్తిగా నిర్ధారించుకోవాలి.

– సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి.

– www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.

– సమీప పోలీస్ స్టేషన్‌లో వెంటనే సమాచారం ఇవ్వాలి.

 

వెంటనే స్పందిస్తే బాధితులు కోల్పోయిన నగదును హోల్డ్ చేసి తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!