ePaper
Sunday, July 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయించాలి : ఏఐటీయూసీ డిమాండ్

అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయించాలి : ఏఐటీయూసీ డిమాండ్

📰 Generate e-Paper Clip

అంగన్‌వాడీలకు ఎన్నికల విధుల సెగ..

కేంద్రాల నిర్వహణ పై తీవ్ర ప్రభావం

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు

ఎన్నికల విధుల కారణంగా అంగన్‌వాడీ సేవలకు ఆటంకం

పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య దెబ్బతింటోందని ఆందోళన

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 23 (వార్త సంధ్య) : జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు అదనంగా అప్పగించిన బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) విధులను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో దాదాపు 50 శాతానికి పైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో హెల్పర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. సహాయకులు లేకపోవడంతో టీచర్లే చిన్నారులకు బోధన, పౌష్టికాహార పంపిణీ, రికార్డుల నిర్వహణ, గర్భిణులు, బాలింతల సంక్షేమ కార్యక్రమాలు వంటి అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అదనంగా ఓటర్ల జాబితా సవరణ, ఇంటింటి సర్వే వంటి బీఎల్‌ఓ విధులను అప్పగించడం వల్ల అంగన్‌వాడీ సేవలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం వల్ల కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అందాల్సిన ప్రీ-స్కూల్ విద్య, గర్భిణులు మరియు బాలింతలకు అందాల్సిన పౌష్టికాహార సేవలకు ఆటంకం కలుగుతోందన్నారు. ప్రభుత్వం మాతా-శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో అంగన్‌వాడీ సిబ్బందిపై అదనపు భారం మోపడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. ఇతర శాఖలైన పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఉపాధి హామీ, రెవెన్యూ శాఖల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం అంగన్‌వాడీ టీచర్లకే బీఎల్‌ఓ బాధ్యతలు అప్పగించడం అన్యాయమన్నారు. అంతేకాకుండా బీఎల్‌ఓ విధులకు సంబంధించి ఎలాంటి టీఏ, డీఏ అలవెన్సులు ఇవ్వడం లేదని, ఆన్‌లైన్ పనుల నిర్వహణ కోసం అవసరమైన ట్యాబ్‌లు లేదా మొబైల్ ఫోన్లు కూడా ప్రభుత్వం సమకూర్చడం లేదని విమర్శించారు. కావున ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయించాలని, ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేనిపక్షంలో మాతా-శిశు సంక్షేమ సేవలు, చిన్నారుల విద్య తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!