ePaper
Tuesday, March 17, 2026
📄 ePaper
Homeతెలంగాణఫార్మాసిటీ – గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై గిరిజనుల ఆగ్రహం…

ఫార్మాసిటీ – గ్రీన్ ఫీల్డ్ రోడ్డుపై గిరిజనుల ఆగ్రహం…

📰 Generate e-Paper Clip

భూములు కాపాడాలని భారీ నిరసనలు

  • 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్

  • ప్రొహిబిటెడ్ జాబితా నుంచి లంబాడీల పట్టా భూములు తొలగించాలని ఆందోళన

  • నిరాహార దీక్షలతో 18 తండాల గిరిజనుల పోరాటం


రంగారెడ్డి జిల్లా బ్యూరో , వార్త సంధ్య:ఫార్మాసిటీ భూ సేకరణ, గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంశాలపై లంబాడీ గిరిజనుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తమ భూములు కోల్పోతున్నామని ఆరోపిస్తూ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగలిగడ్డ తండా, మరలకుంట, వాయలికుంట, కుర్మిది, పోతుబండ తండా సహా దాదాపు 18 తండాలకు చెందిన గిరిజనులు నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ ఆందోళన కార్యక్రమానికి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడవాత్ రాంబల్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్, గిరిజన నాయకుడు కిషన్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఫార్మాసిటీ పేరుతో వేల ఎకరాల భూములను సేకరించిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్త పేర్లతో మళ్లీ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ప్రత్యేకంగా 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం పేరుతో లంబాడీల పట్టా భూములను తీసుకోవడం అన్యాయమని వారు మండిపడ్డారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి భూములను కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి, ఇతర వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో కొన్ని వర్గాల భూములను ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించడం వివక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదని, లంబాడీల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది నాయకులు తమ అనుచరుల పేర్లపై వందల ఎకరాలు సంపాదిస్తుంటే, గిరిజనుల చిన్న చిన్న భూములను కూడా లాక్కోవడం అన్యాయమని అన్నారు.

తక్షణమే 330 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని, లంబాడీలకు చెందిన సుమారు 350 ఎకరాల పట్టా భూములను ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎవరి పేర్లపై పట్టాలు ఉన్నాయో వారికి తిరిగి హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిరాహార దీక్షలు గ్రీన్ ఫీల్డ్ రోడ్ పూర్తిగా రద్దు అయ్యే వరకు కొనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు. తమ భూములు తిరిగి ఇవ్వకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని లంబాడీ నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!