ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రూ.600 కోట్ల రుణం ఎందుకు?

రూ.600 కోట్ల రుణం ఎందుకు?

📰 Generate e-Paper Clip

  • కార్పొరేషన్‌ పై ఆర్థిక భారం మోపొద్దు
  • భీమ శ్రీవల్లి శ్రీధర్, కంభంపాటి దుర్గాప్రసాద్

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, ఆగస్టు 07 (వార్త సంధ్య) : కొత్తగూడెం కార్పొరేషన్‌ను భారీ రుణభారంలోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ కార్పొరేటర్ భీమ శ్రీవల్లి, స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్ ఆరోపించారు. జర్మనీ బ్యాంకు నుంచి రూ.600 కోట్ల రుణం తీసుకురావాల్సిన అవసరం కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఏముందని వారు ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు అవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా భారీ రుణాల పేరుతో భవిష్యత్ తరాలపై ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. 67వ డివిజన్ కార్పొరేటర్ భీమ శ్రీవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కార్పొరేషన్‌లో ప్రతిపాదిస్తున్న డీపీఆర్, రుణం, అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై పలు ప్రశ్నలు సంధించారు.

డీపీఆర్ రద్దు చేయాలి : 

జర్మనీ బ్యాంకు నుంచి ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్న రూ.600 కోట్ల రుణానికి సంబంధించిన డీపీఆర్‌ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. డీపీఆర్ కోసం సుమారు రూ.9.60 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. డీపీఆర్‌కు సంబంధించి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోందని, దీనిపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. డీపీఆర్‌కు సంబంధించి వాస్తవంగా ఎంత ఖర్చు చేశారు? ఎవరికి చెల్లించారు? ఏ సంస్థకు బాధ్యతలు అప్పగించారు? అనే వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రూ.600 కోట్ల రుణం తీసుకురావాలని ప్రతిపాదిస్తూ, మరోవైపు డీపీఆర్‌కే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

కార్పొరేషన్‌కు అవసరమైన పనులు ఏవి…?

కొత్తగూడెం పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, విద్యుత్ స్తంభాలు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. వీటిని పరిష్కరించకుండా వందల కోట్ల రూపాయల రుణం తీసుకుని భారీ ప్రాజెక్టులు చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. పట్టణంలో నీటి సరఫరా పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, విద్యుత్ స్తంభాల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆరు నెలలుగా నిధులు లేక అభివృద్ధి పనులు మందగించాయని ఆరోపించారు. చెత్త సేకరణ వాహనాలు సైతం మరమ్మతులకు గురై ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముందుగా ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనులు చేపట్టాలని కోరారు.

రూ.9.60 కోట్ల డీపీఆర్‌పై ప్రశ్నలు : 

డీపీఆర్ తయారీకి రూ.9.60 కోట్ల వరకు వ్యయం అవుతుందన్న అంశంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీపీఆర్‌లోనే ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డీపీఆర్ తయారీ, సలహాదారుల నియామకం, పనుల పర్యవేక్షణకు సంబంధించిన ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.‘స్టార్ అలైన్ అడ్వైజర్’కు పనులు అప్పగించినట్లు పేర్కొంటూ, ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించారు? ఎంత మొత్తంలో చెల్లింపులు చేశారు? అనే విషయాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.

ఆరు లేన్ల జాతీయ రహదారి సాధ్యమేనా…?

నాయకులగూడెం నుంచి పెద్దమ్మతల్లి రహదారి వరకు ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా వారు ప్రశ్నలు సంధించారు. ఈ రహదారికి జాతీయ రహదారి అనుమతులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన అనుమతులు వచ్చాయా? అనే విషయాలను వెల్లడించాలని కోరారు. రూ.600 కోట్లతో ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం సాధ్యమా? దాని అవసరం ఎంతవరకు ఉంది? అనే అంశాలపై సమగ్ర చర్చ జరగాలని అన్నారు.

కార్పొరేషన్ భవనం సంగతేంటి …?

ప్రస్తుత మున్సిపల్ కార్యాలయ పరిస్థితి, కొత్త భవన నిర్మాణం తదితర అంశాలపై కూడా వారు ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. కూరగాయల మార్కెట్‌లో సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, మార్కెట్ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

రూ.6 కోట్ల స్మశాన వాటిక కు అభినందనలు : 

రూ.6 కోట్లతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టడం మంచి నిర్ణయమని వారు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ఇలాంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఆర్టీసీ బస్సుల నుంచి విద్యుత్ బస్సుల వరకు : 

ఉచిత బస్సు ప్రయాణ పథకంతో పాటు విద్యుత్ బస్సుల అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. పట్టణ ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆరు నెలలుగా అభివృద్ధి పనులు లేవు : 

గత కొన్ని నెలలుగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని వారు ఆరోపించారు. కౌన్సిల్ సమావేశాల్లో సమస్యలు ప్రస్తావించినప్పటికీ సరైన స్పందన కనిపించడం లేదన్నారు. మేయర్, ఎమ్మెల్యేలు కార్పొరేషన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి నిధులు కేటాయించాలని సూచించారు.

కార్పొరేషన్‌కు అప్పుల భారం వద్దు : 

కేంద్ర బ్యాంకు రుణాలు, విదేశీ రుణాలు తీసుకురావడం ద్వారా కార్పొరేషన్‌పై ఆర్థిక భారం మోపవద్దని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని, ఇప్పుడు కార్పొరేషన్‌ను కూడా రుణభారంలోకి నెట్టడం సరికాదన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎంత ఆదాయం వస్తోంది? ఇప్పటికే ఎంత అప్పు ఉంది? కొత్తగా తీసుకునే రుణానికి వడ్డీ ఎంత? తిరిగి చెల్లింపు ఎలా ఉంటుంది? అనే అంశాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు.

స్వతంత్రంగా ప్రశ్నిస్తున్నాం : దుర్గాప్రసాద్

స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గత నాలుగు నెలలుగా డీపీఆర్ విషయంలో అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. డీపీఆర్‌లో పారదర్శకత లేదని ఆరోపించారు. ప్రజలపై భారం పడే విధంగా తీసుకునే నిర్ణయాలను తాము ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. కార్పొరేషన్‌కు అవసరం లేని రుణాలను తీసుకురావడం ఆపాలని, ముందుగా ప్రజలకు అవసరమైన పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

మిత్రపక్షమా.. ప్రతిపక్షమా?

కాంగ్రెస్‌, సీపీఐ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై కూడా వారు ప్రశ్నలు సంధించారు. సీపీఐ, కాంగ్రెస్‌ మిత్రపక్షాలుగా ఉంటే కార్పొరేషన్‌లో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, ప్రజాధనం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. డబ్బులకు, రాజకీయ ప్రయోజనాలకు లొంగకుండా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

పట్టాల సమస్యను పరిష్కరించాలి : 

కొత్తగూడెం పరిధిలో పట్టాల సమస్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. 76వ జీవోకు సంబంధించిన పట్టాల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ఎమ్మెల్యేతో కలిసి తాము కూడా పోరాటం చేస్తామని తెలిపారు.

సింగరేణి నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలి : 

డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా కొత్తగూడెం ప్రాంతానికి కొత్తగా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి? వాటిని ఏ పనులకు కేటాయించారు? అనే వివరాలను ప్రజల ముందుంచాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి నుంచి కొత్తగూడెం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి మూడు మంది మంత్రులు ఎన్ని నిధులు తీసుకొచ్చారు? వాటితో చేపట్టిన పనులు ఏమిటి? అనే వివరాలు వెల్లడించాలని కోరారు.

ఎమ్మెల్యే కార్పొరేషన్‌పై దృష్టి పెట్టాలి : 

కొత్తగూడెం ఎమ్మెల్యే కార్పొరేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని భీమ శ్రీవల్లి కోరారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు నిలిచిపోకుండా నిధులు తీసుకురావాలని సూచించారు.“కొత్తగూడెం ప్రజలకు అవసరమైన పనులు చేయాలి. ప్రజాధనం న్యాయంగా, పారదర్శకంగా ఖర్చు చేయాలి. కార్పొరేషన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టకుండా భవిష్యత్తును కాపాడాలి. ప్రజా సమస్య ఏదైనా మా దృష్టికి వస్తే పోరాటం చేస్తాం” అని భీమ శ్రీవల్లి పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రజలు వాస్తవాలను తెలుసుకుని కార్పొరేషన్ భవిష్యత్తుపై చర్చించాల్సిన సమయం వచ్చిందని వారు అన్నారు. పాలకవర్గం, అధికారులు ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!