తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా విజయం సాధించిన వెంకట్ యాదవ్ కు ఘన సన్మానం

హైదరాబాద్, జూన్ 14 (వార్త సంధ్య): తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా రెండోసారి ఘనవిజయం సాధించిన సీనియర్ న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్‌కు ఆదివారం హైదరాబాద్‌లో ఘన సన్మానం నిర్వహించారు. భాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విజయోత్సవ సభలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని వెంకట్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులను సమీకరించడంలో చలకాని వెంకట్ యాదవ్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. న్యాయవాదుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వెంకట్ యాదవ్ గతంలో హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్‌గా సమర్థవంతంగా సేవలందించారని గుర్తుచేశారు. బార్ కౌన్సిల్ సభ్యునిగా ఆయన న్యాయవాదుల సంక్షేమం కోసం మరింత చురుకుగా పనిచేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెంకట్ యాదవ్‌కు సూచించిన మధుయాష్కి గౌడ్, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు ఇచ్చిన హామీల అమలులో ఆయన కీలక పాత్ర పోషించాలని కోరారు. ఆ దిశగా తాను కూడా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అనేక రంగాల్లో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం పొందలేదని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం సాధన కోసం మరింత బలమైన పోరాటం అవసరమని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.
సన్మానానికి స్పందించిన చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హైకోర్టు, జిల్లా కోర్టుల్లో స్టాండింగ్ కౌన్సిల్, గవర్నమెంట్ ప్లీడర్ తదితర పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మధుయాష్కి గౌడ్ విశేష కృషి చేశారని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చిన నాయకుడు మధుయాష్కి గౌడ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్, పాలమూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీనివాస్, స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, అఖిల భారత యాదవ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్‌తో పాటు పలువురు న్యాయవాదులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

