- మీనాక్షి నటరాజన్ వంటి మహిళా నేతను అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్య
- బీజేపీ దొంగతనంపై బీఆర్ఎస్ మాట్లాడడం లేదని విమర్శ
హైదరాబాద్ / గాంధీభవన్ , జూన్ 11 (వార్త సంధ్య): కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ దిగజారుడు రాజకీయాలు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఆరోపించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, దేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో మూడో రాజ్యసభ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ అనైతిక రాజకీయాలు చేసిందని ఆరోపించారు.
మీనాక్షి నటరాజన్ ఒక సాదాసీదా, గాంధేయ సిద్ధాంతాలను విశ్వసించే మహిళా నాయకురాలని, అలాంటి వ్యక్తిని రాజకీయంగా అడ్డుకోవడం దురదృష్టకరమని అన్నారు. నమోదు కాని కేసును సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని అడ్డుకున్నారని ఆరోపించిన ఆయన, ఒక చిన్న ఫిర్యాదును ఆధారంగా తీసుకుని నామినేషన్ తిరస్కరించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మీనాక్షి నటరాజన్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ తరచూ ఎన్నికల ప్రక్రియలో అక్రమాల గురించి ప్రస్తావిస్తున్నారని, అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాల్లో రాజకీయ ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వ్యవస్థను బీజేపీ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
బీజేపీ 12 ఏళ్ల పాలనలో కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని, విదేశాల్లోని నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని ఇచ్చిన హామీలకు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చింది పరిపాలన కోసం గానీ, రాజకీయ కుట్రల కోసం కాదని వ్యాఖ్యానించారు.
బీజేపీ చేసిన చర్యలపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి టి హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలకు వాస్తవాలతో సంబంధం లేదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనే ఆరోపణలపై స్పందిస్తూ, అలాంటి ఆరోపణలు బీజేపీ సృష్టిస్తున్న దుష్ప్రచారంలో భాగమేనన్నారు. పార్టీకి నష్టం చేసే వారు ఎవరైనా ఉంటే చర్యలు తీసుకుంటామని, కానీ ఆధారాలు లేకుండా బురదజల్లడం సరైంది కాదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే చర్యలు దేశానికి మంచివి కావని, బీజేపీ తన చర్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

