- సింగరేణి ఆస్తులపై దాడులకు పిలుపు ఇవ్వడం దారుణం
- రైల్వే పట్టాలు తొలగించమని చెప్పడం దేశ భద్రతకు ముప్పు
భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 27 (వార్త సంధ్య) : సింగరేణి సంస్థ ఆస్తులను తగులబెట్టాలని, మందమర్రి జీఎం కార్యాలయం, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ధ్వంసం చేయాలని, రైల్వే పట్టాలను తొలగించి రైళ్లను నిలిపివేయాలని బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన వ్యక్తి ప్రజా ఆస్తులను ధ్వంసం చేయాలని, తీవ్రవాద తరహా చర్యలకు పిలుపునివ్వడం అత్యంత ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడమే కాకుండా శాంతిభద్రతలకు ముప్పుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి బీఆర్‌ఎస్ జాగీరు కాదు :
సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, అది లక్షలాది కార్మికుల చెమట చుక్కలతో నిర్మితమైన మహోన్నత సంస్థ అని ఆకునూరి సుప్రియ అన్నారు. “సింగరేణి ఆస్తులు కార్మికుల సొత్తు. రాజకీయ లబ్ధి కోసం కార్మికులను రెచ్చగొట్టడం దుర్మార్గం” అని విమర్శించారు. ప్రజా ఆస్తులను తగులబెట్టాలని పిలుపునివ్వడం దేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. బాల్క సుమన్‌పై సుమోటోగా కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ అగ్రనేతలపై ప్రశ్నలు :
హరీష్ రావు సమక్షంలోనే బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారని, అక్కడ ఉన్న ఇతర బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు స్పందించలేదని ఆకునూరి సుప్రియ ప్రశ్నించారు. “ప్రజా ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం బీఆర్‌ఎస్ అధికారిక విధానమా?” అని నిలదీశారు. ఈ ఘటనపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలకు మరియు సింగరేణి కార్మికులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి :
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ వెంటనే స్పందించి బాల్క సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆకునూరి సుప్రియ కోరారు. సింగరేణి అస్తిత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

