ePaper
Friday, November 6, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలి!

ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలి!

📰 Generate e-Paper Clip

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు..

దుర్వాసన, పొగ, కాలుష్యంతో కాలనీల ప్రజలకు ఇబ్బందులు!

డంపింగ్ యార్డ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలి

తరలించే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్

రంగారెడ్డి జిల్లా, తేదీ (వార్త సంధ్య):

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తరలించాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.

ఈ మేరకు గురువారం ఉదయం బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ నుంచి ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన నాయకులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చెత్త నిల్వ, వ్యర్థ పదార్థాల నిర్వహణ, దుర్వాసన, పొగ, కాలుష్య సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, విషపూరిత పొగ, గాలి కాలుష్యం, వ్యర్థాల వల్ల నీటి కాలుష్య సమస్యలు పరిసర ప్రాంతాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. వందలాది కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో డంపింగ్ యార్డ్ కొనసాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

 

జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి స్పందించాలి

 

జీహెచ్ఎంసీ అధికారులు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే స్పందించి ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి నాణ్యతను పరీక్షించాలని, వ్యర్థాల నిర్వహణలో పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేయాలని కోరారు. ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉన్నట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

డంపింగ్ యార్డ్‌ను పూర్తిస్థాయిలో తరలించే వరకు బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని బొంగు వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ పాదయాత్రలో బీసీ నాయకులు జలమోని రవీందర్ ముదిరాజ్, కొంగరి కృష్ణ, బంజారా జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే. గాంధీ నాయక్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు చిప్పలపల్లి యాదగిరి, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు నకిరేకంటి శ్రీకాంత్, చిప్పలపల్లి నరేందర్, చిప్పలపల్లి సురేష్, చేగూరి పరమేష్ పాల్గొన్నారు.

అలాగే జై భారత్ జాతీయ ఉపాధ్యక్షుడు ఖదిజ్ఞాసి వంశీ, రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సైదయ్య, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది ఖదిజ్ఞాసి గణేష్ గల్లా, జై భారత్ ఎస్సీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఖదిజ్ఞాసి మధు మాదిగ, జై భారత్ ఎస్సీ, బీసీ, ఎస్టీ పోరాట వేదిక నాయకులు పాండు, గురువయ్య, శ్రీనివాస్ పిట్ల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!