భద్రాద్రి, ఆగస్టు 09 (వార్త సంధ్య) : తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈసారి గతంలో పంపిణీ చేసిన నీలం రంగుకు బదులుగా చిలకపచ్చ రంగులో కొత్త డిజైన్లతో చీరలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మే నెలలో మొత్తం 4.62 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి పూర్తయింది. మిగిలిన ఉత్పత్తిని కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. చీరల ఉత్పత్తి, పంపిణీ కోసం ప్రభుత్వం రూ.450 కోట్లు కేటాయించగా.. రూ.142 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సెప్టెంబరు 20లోగా చీరల ఉత్పత్తిని పూర్తిచేసి.. అక్టోబర్‌లో మహిళలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చీరల ఉత్పత్తి కారణంగా రాజన్న సిరిసిల్ల పవర్‌లూమ్‌లు, మ్యాక్స్ సంఘాలకు పెద్దఎత్తున పని లభిస్తోంది. దీంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతన్నల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో చేనేత, పవర్‌లూమ్ రంగానికి మరింత ఉపాధి లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

