ఫీజుల నియంత్రణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్
కార్పొరేట్ విద్యా వ్యాపారులకు అండగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణ
కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, ప్రజాసంఘాల మీడియా సమావేశం
హైదరాబాద్, జూన్ 15 (వార్త సంధ్య): విద్యా వికాసం లేని చోట సమాజం వికసించదని, విద్య హక్కు కాని వ్యాపార వస్తువు కాదని కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ రాష్ట్ర చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ, అక్రమ డొనేషన్లు, విద్యా రంగంలో పెరుగుతున్న వాణిజ్యీకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం తెలంగాణ తల్లిదండ్రుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చెన్నోజు శ్రీనివాసులు మాట్లాడుతూ, లక్షలాది మంది తల్లిదండ్రులు విద్యా ఫీజుల భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లాది రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఫీజుల నియంత్రణకు శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. విద్య హక్కుగా ఉండాల్సిన పరిస్థితిలో వ్యాపార వస్తువుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించిన ఆయన, స్కూల్స్ మరియు ఇంటర్ కళాశాలల ఫీజుల నియంత్రణ కమిటీని ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పేద కుటుంబాల పిల్లల విద్యా ఫీజులను ప్రభుత్వం ఎందుకు భరించడం లేదని, ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమ డొనేషన్లు, మేనేజ్మెంట్ సీట్ల పేరుతో సాగుతున్న దోపిడీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
లక్షలాది తల్లిదండ్రులు అప్పుల పాలవుతుంటే ప్రభుత్వం ప్రజల పక్షాన నిలుస్తుందా లేక కార్పొరేట్ విద్యా వ్యాపారుల పక్షాన నిలుస్తుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రజల పక్షాన ఉంటే ఈ అంశాలపై మౌనం ఎందుకని ప్రశ్నిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. స్కూల్స్, ఇంటర్ కళాశాలల ఫీజుల నియంత్రణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, పేద కుటుంబాల పిల్లల ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది వేతనాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి శ్రమదోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమ డొనేషన్లపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలంటే విద్యను ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి అందరికీ ఉచిత, సమాన, నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యా దోపిడీకి ఇది మాత్రమే శాశ్వత పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ప్రజల విద్యా హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, ప్రజాసంఘాలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమ కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ వైస్ చైర్మన్ గోపీనాథన్ కట్టేకోల, గంగుల నరసింహారెడ్డి, కృష్ణ నాయక్, సాయికుమార్, రుక్ముద్దీన్, పి. రాణి, అంబటి తులసి, రత్న కుమారి, బచ్చు రామకృష్ణ, చంద్రశేఖర్ సాగర్, పి. రమేష్, బొట్టు రమేష్, చిన్న రాములు, గోరేటి గణేష్, యోగేష్ యాదవ్, ముఖేష్, జి. మాధవాచారి, అరెపోగు లక్ష్మణ్, ఆంజనేయచారి తదితరులు పాల్గొన్నారు.

