- సీసీ కెమెరాలతో కేసు ఛేదించిన పోలీసులు
- మహిళ దృష్టి మళ్లించి నగదు దొంగిలింపు
- ఇండియన్ బ్యాంకులో జరిగిన చోరీ కలకలం
- ముగ్గురు మహిళా నిందితులకు రిమాండ్
- పరారీలో మరో మహిళ కోసం ప్రత్యేక గాలింపు
- బ్యాంకుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
మహబూబాబాద్ జిల్లా బ్యూరో, మే 29 (వార్త సంధ్య) : టౌన్‌లో మహిళ దృష్టి మళ్లించి బ్యాంకులో నుంచి రూ.46 వేల నగదు అపహరించిన ఘటనలో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని టౌన్ సీఐ రఘుపతి రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంకు శాఖలో ఓ మహిళ బ్యాంకులో నగదు తీసుకున్న సమయంలో ఆమె దృష్టి మళ్లించి నగదును దొంగిలించిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఘటనకు పాల్పడిన ముగ్గురు మహిళలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసులో మరో మహిళ పరారీలో ఉండగా, ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు బ్యాంకులకు నగదు లావాదేవీల కోసం వెళ్లే సమయంలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్సై ఉమా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

