- త్వరలో రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్ల మంజూరు
- కూసుమంచి ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి భరోసా
భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 03 (వార్త సంధ్య) :
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పారదర్శక పాలనను ప్రజల గడప వద్దకే తీసుకెళ్తున్నామని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలోని మండలాలను క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లలో అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును రాజకీయాలకు అతీతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాదా బైనామా, నిషేధిత జాబితా, భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజా దర్బార్లలో ఎక్కువగా ‘ఇందిరమ్మ’ ఇళ్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొన్న మంత్రి, గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, మే నెలాఖరు నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.
రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ, వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేసి వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 25 లక్షల మందికి రుణమాఫీ అమలు చేసినట్లు, రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచినట్లు, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని గుర్తుచేశారు. మే 5 నుంచి 7 వరకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

