జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభం
డేటా సేకరణలో ఖచ్చితత్వం పాటించాలని సూచన
మొబైల్ యాప్ ద్వారా జనాభా గణన వివరాల నమోదు
భద్రాద్రి జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – మార్చి 15: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనగణన–2027 కార్యక్రమాన్ని జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా మరియు గృహ వసతుల గణనపై జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆదివారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 15, 16, 17 తేదీలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో అధికారులు జనగణన డేటా సేకరణ విధానంపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.డేటా సేకరణ సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, లోపరహితంగా పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
జనగణనపై డిజిటల్ విధానంలో అవగాహన కల్పించేందుకు జనగణన విభాగం అధికారులు, ట్రైనర్లు సాఫ్ట్‌వేర్ ద్వారా వివరాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది వంటివని కలెక్టర్ పేర్కొన్నారు.పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాలు అవసరమని తెలిపారు. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడతాయని, పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు.
మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ జరుగుతాయని వివరించారు. ప్రతి ఎన్యూమరేటర్ తనకు కేటాయించిన లాగిన్ వివరాలతో యాప్‌ను సక్రమంగా వినియోగించడం, డేటా ఎంట్రీ చేయడం, సర్వర్‌కు లింక్ చేయడం వంటి అంశాల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు. వయస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వసతుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. గృహ నిర్మాణం, నీటి వనరు, మరుగుదొడ్డి, విద్యుత్, వంట ఇంధనం, ఇంటర్నెట్ సౌకర్యం వంటి 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, జెడ్పీసీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఉదయభాస్కర్ గణాంక అధికారి, ఈడియం సైదేశ్వరరావు, మాస్టర్ ట్రైనర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

