ePaper
Monday, March 16, 2026
spot_img
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

📰 Generate e-Paper Clip

  • ప్రియుడి సహాయంతో దిండు పెట్టి ఊపిరాడకుండా హత్య

  • సహజ మరణంగా చూపించే ప్రయత్నం

  • కుమార్తె చెప్పడంతో బయటపడిన అసలు విషయం


భద్రాద్రి జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – మార్చి 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసు వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనం రేపింది. భర్తను హత్య చేసి సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌డీ జాఫర్ సెంట్రింగ్ కూలీగా పనిచేస్తున్నాడు. సుమారు 13 సంవత్సరాల క్రితం ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన ఖతిజాను వివాహం చేసుకున్నాడు. దంపతులు పదేళ్ల పాటు తిప్పనపల్లిలో నివసించగా, గత మూడేళ్లుగా చింతలపూడిలో ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు హాస్టల్‌లో చదువుతుండగా, ఎనిమిదేళ్ల కుమార్తె తల్లిదండ్రులతోనే ఉండేది.

చింతలపూడి ప్రాంతానికి చెందిన మీరా అనే వ్యక్తితో ఖతిజాకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. ఈ విషయం జాఫర్‌కు తెలిసిన తరువాత దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత పది రోజులుగా ఈ గొడవలు మరింత తీవ్రరూపం దాల్చినట్లు తెలిసింది.

తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఖతిజా, ప్రియుడి సహాయంతో హత్యకు పథకం రచించింది. జాఫర్ నిద్రపోతున్న సమయంలో అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మద్యం సేవించి పడిపోయి గాయపడి మరణించినట్లు నమ్మిస్తూ కుటుంబ సభ్యులను మోసం చేసి అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు వెల్లడించారు.

అయితే అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో ఎనిమిదేళ్ల కుమార్తె “నాన్నను అమ్మ, మరో వ్యక్తి కలిసి చంపేశారు” అని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఖతిజాను ప్రశ్నించగా వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం ఖతిజాను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!