- సికింద్రాబాద్‌లో హాట్ హాట్ సమావేశం
రైల్వే అధికారులపై ఆగ్రహం
భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 28 (వార్త సంధ్య) : సికింద్రాబాద్ రైల్వే సంచలన్ భవన్‌లో నిర్వహించిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ డీఆర్‌యూసీసీ సభ్యుల సమావేశం ఉద్రిక్తంగా సాగింది. సమావేశంలో డీఆర్‌యూసీసీ సభ్యుడు వై. శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల రైల్వే సమస్యలను గట్టిగా ప్రస్తావించారు.తిరుపతికి ప్రత్యేక రైలు నడుపుతామని గతంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని అధికారులను ప్రశ్నించారు. మణుగూరు నుంచి తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో నడిచిన మణుగూరు–డోర్నకల్–కాజీపేట ప్యాసింజర్ రైలు, అలాగే కొల్హాపూర్–బెల్గావి ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎందుకు నిలిపివేశారో వివరణ కోరుతూ, వాటిని తక్షణమే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పనులను వేగవంతం చేసి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.అలాగే రాజీవ్ పార్క్–ప్రగతి మైదానం–ఎన్‌జీవోస్ కాలనీ మధ్య రైల్వే ట్రాక్ దారిని మూసివేయడంతో స్థానిక ప్రజలు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని, దానిని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్లాట్‌ఫామ్ 1కు బదులుగా ప్లాట్‌ఫామ్ 2పై ఆగుతున్నందున వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వ్యవస్థను మార్చాలని సూచించారు.స్టేషన్ సెంటర్ నుంచి త్రీటౌన్ గొల్లగూడెం వరకు రహదారి వెడల్పు పనులకు అవసరమైన స్థలాన్ని కేటాయించి క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరారు. ఈ సందర్భంగా డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు, డీఆర్‌యూసీసీ సభ్యులు పాల్గొన్నారు.

