ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

📰 Generate e-Paper Clip

  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష
  • పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక కార్యాచరణ
  • సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం
  • భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల పరిష్కారానికి చర్యలు
  • రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం

హైదరాబాద్, జూన్ 11 (వార్త సంధ్య): ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌధలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించేందుకు పెండింగ్‌లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల విడుదల వంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగ భవిష్యత్తును మార్చగల కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించే అవకాశం కలుగుతుందని వివరించారు.

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సాగునీటి విస్తరణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అత్యంత ప్రాధాన్య అంశాలని మంత్రి స్పష్టం చేశారు. రైతుల అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!