ePaper
Friday, October 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జవహర్‌నగర్‌లో భూ మాఫియా..?

జవహర్‌నగర్‌లో భూ మాఫియా..?

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ భూములకు కాపలాదారులెవరు?

  • మొన్న కూల్చివేతలు.. నేడు బేస్‌మెంట్లు!

  • పగలు.. రాత్రి తేడా లేకుండా నిర్మాణాలు.. అధికారులకు కనిపించవా?

  • ప్రభుత్వ భూముల్లో నోటరీల దందా.. 499, 500 సర్వే నంబర్లపై ఆరోపణలు

  • 80 గజాల ప్లాట్‌.. రూ.20–30 లక్షలు! కొనుగోలుదారుల భవిష్యత్తు ఎవరి బాధ్యత?

  • అసైన్డ్‌ భూములూ చేతులు మారుతున్నాయా..? ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం?

 

హైదరాబాద్/జవహర్‌నగర్, సెప్టెంబర్ 27 ( వార్త సంధ్య ) : ఒకవైపు ప్రభుత్వ భూమి అని అధికారులు గతంలో నిర్మాణాలను తొలగించారు.. మరోవైపు అదే ప్రాంతంలో మళ్లీ బేస్‌మెంట్లు పడుతున్నాయి. ఒకసారి ఫెన్సింగ్‌ వేసి హెచ్చరిక బోర్డులు పెట్టారు.. ఇప్పుడు ఆ బోర్డుల నీడలోనే కొత్త నిర్మాణాలు వెలుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు.. రాత్రి తేడా లేకుండా గదులు, షెడ్లు, ఇతర నిర్మాణాలు సాగుతున్నా సంబంధిత అధికారులకు కనిపించడం లేదా? తెలిసినా పట్టించుకోవడం లేదా? లేక అధికారుల కళ్ల ముందే వ్యవహారం సాగుతోందా? అన్న ప్రశ్నలు జవహర్‌నగర్‌ బాలాజీనగర్‌ కాలనీలో చర్చనీయాంశంగా మారాయి.

 

 

నాలుగు ఎకరాలకు పైగా భూమి.. కథ మాత్రం చిన్నది కాదు!

బాలాజీనగర్‌ కాలనీ, గోశాల సమీపంలోని సర్వే నంబర్లు 499, 500లో సుమారు 4.30 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని గతంలో రెవెన్యూ అధికారులు గుర్తించి నిర్మాణాలను తొలగించారని, జనవరి 2026లో మరోసారి నిర్మాణాలను తొలగించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు పెట్టారని వారు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన తర్వాత కూడా అదే ప్రాంతంలో కొత్త నిర్మాణాలు ఎలా మొదలయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

 

మొన్న అక్రమం.. ఇయ్యాల సక్రమం ఎలా?

ఒక భూమిపై అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారని రికార్డుల్లో ఉంటే.. అదే భూమిపై కొంతకాలానికే మళ్లీ నిర్మాణాలు ఎలా ప్రారంభమవుతాయి? గతంలో ప్రభుత్వ భూమి అని గుర్తించిన స్థలంలో ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడానికి ఎవరి ధైర్యం? నిర్మాణదారులకు భూమిపై ఏ హక్కు ఉందనే ఆధారాలు ఉన్నాయి? ఉంటే వాటిని ఏ శాఖ పరిశీలించింది? ఇవన్నీ కేవలం స్థానికుల అనుమానాలు మాత్రమే కాకుండా అధికారిక రికార్డులతో తేల్చాల్సిన ప్రశ్నలుగా మారాయి.

 

పగలు.. రాత్రి నిర్మాణాలు.. అయినా నిఘా ఎక్కడ?

ప్రస్తుతం ఈ ప్రాంతంలో బేస్‌మెంట్లు వేయడం, గదులు నిర్మించడం, ఇతర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగటిపూటే కాకుండా రాత్రి వేళల్లోనూ నిర్మాణాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇంత బహిరంగంగా నిర్మాణ సామగ్రి తరలింపు, కూలీల రాకపోకలు, బేస్‌మెంట్ల తవ్వకాలు, నిర్మాణ పనులు జరుగుతున్నా సంబంధిత శాఖల నిఘా ఎందుకు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చర్యలు తీసుకున్న అధికారులు ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను గుర్తించలేదా? గుర్తించి ఉంటే ఎందుకు ఆపలేదు? అన్నదే అసలు ప్రశ్న.

 

 

80 గజాల ప్లాట్‌కు రూ.20–30 లక్షలు?

ఈ ప్రాంతంలో 80 గజాల చొప్పున ప్లాట్లు చూపిస్తూ రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇళ్లు నిర్మించుకోవాలనే ఆశతో వచ్చే సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భూమిపై చట్టబద్ధమైన హక్కులు లేకపోతే రేపు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు నష్టపోయేది ప్లాట్లు విక్రయిస్తున్నవారు మాత్రమే కాదు.. జీవితకాల పొదుపుతో స్థలం కొనుగోలు చేసిన సామాన్య కుటుంబాలే. అందుకే ఈ భూములపై విక్రయాలు జరుగుతున్నాయా? జరిగితే ఏ పత్రాల ఆధారంగా జరుగుతున్నాయి? అన్నది అధికారికంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

 

 

ప్రభుత్వ భూముల్లో నోటరీల దందా?

2013లో 9867/2013 నంబర్‌తో ఉన్నట్లు చెబుతున్న ఒక పత్రంలో మాజీ సైనికుడు అంజనీ కుమార్‌ నుంచి ఈశ్వర్‌గౌడ్‌కు ఐదు ఎకరాల భూమి రూ.8 లక్షలకు విక్రయించినట్లు పేర్కొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ పత్రంలోని సంతకాలపై అనుమానాలు ఉన్నాయని, పత్రం నిజమైనదేనా? కాదా? అన్నది సంబంధిత రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలు పరిశీలించాల్సి ఉందని వారు కోరుతున్నారు. పత్రంలో భూమి నాలుగు దిక్కుల హద్దులు స్పష్టంగా లేవన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ పత్రం ఏ భూమికి సంబంధించినది? దాని మూల హక్కుదారు ఎవరు? ఆ భూమి ప్రభుత్వ భూమా? అసైన్డ్‌ భూమా? పట్టా భూమా? పత్రం చట్టబద్ధంగా నమోదైందా? అనే అంశాలు రికార్డుల పరిశీలనతోనే తేలాలి.

 

ఒకే భూమి.. పలువురి పేర్లు?

ఈ ఐదు ఎకరాల భూమి తరువాత దాసుకు రెండు ఎకరాలు, కొండల్‌ ముదిరాజ్‌కు ఒక ఎకరం, సంతోష్‌గౌడ్‌కు ఒక ఎకరం, గోడుగు వేణుకు ఒక ఎకరం చొప్పున వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరు అక్కడ నిర్మాణాలు చేపట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమైతే ఆ లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఏమిటి? భూమి హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే భూమిపై వరుసగా హక్కులు ఎలా ఏర్పడ్డాయి? నోటరీ పత్రాలకు, రిజిస్ట్రేషన్‌ రికార్డులకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం.

 

 

అసైన్డ్‌ భూములపై కూడా కన్నా?

జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన భూములు, అసైన్డ్‌ భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు చిన్నచిన్న ముక్కలుగా మారి ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయన్న ఆరోపణలు నిజమైతే, ఇది ఒక్క కాలనీ సమస్యగా చూడలేని అంశం. భూముల అసలు విస్తీర్ణం, ప్రభుత్వ భూముల రికార్డులు, అసైన్డ్‌ భూముల వివరాలు, ఆక్రమణల స్థితి వంటి అంశాలపై సమగ్ర సర్వే జరిగితేనే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వ భూముల విలువ భారీగా ఉన్న నేపథ్యంలో అక్రమ ఆక్రమణలు నిజమైతే ప్రభుత్వానికి భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

కూల్చేశారు.. ఫెన్సింగ్‌ వేశారు.. మళ్లీ నిర్మాణాలు ఎలా?

ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఇదే. గతంలో అధికారులు నిర్మాణాలను తొలగించారు. భూమికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డులు పెట్టారు. మరి ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ప్రారంభం కావడానికి పరిస్థితి ఎలా ఏర్పడింది? ఒకసారి ప్రభుత్వ భూమిగా గుర్తించి చర్యలు తీసుకున్న స్థలంలో మళ్లీ నిర్మాణం జరిగితే.. దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నిర్మాణాలు ప్రారంభమైన వెంటనే అధికారులు స్పందించారా? నోటీసులు ఇచ్చారా? చర్యలు తీసుకున్నారా? లేక నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికులను వేధిస్తున్నాయి.

 

 

ఈ దందాలో అసలు సూత్రధారి ఎవరు?

ప్లాట్‌ ఎవరు చూపిస్తున్నారు? పత్రాలు ఎవరు తయారు చేస్తున్నారు? కొనుగోలుదారులకు ఎవరు హామీ ఇస్తున్నారు? నిర్మాణాలకు ఎవరు సహకరిస్తున్నారు? గతంలో అధికారులు తొలగించిన ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది?

ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఒక్క నిర్మాణాన్ని తొలగించడం సరిపోదు. భూమి మూల రికార్డుల నుంచి మొదలుకొని ప్రస్తుతం జరుగుతున్న విక్రయాలు, పత్రాలు, నిర్మాణాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, సంబంధిత అనుమతులు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది.

 

వార్త సంధ్య కథనానికి స్పందించిన ఆర్‌ఐ

జవహర్‌నగర్‌ బాలాజీనగర్‌ ప్రాంతంలోని సర్వే నంబర్లు 499, 500పై వచ్చిన ఆరోపణలు, గతంలో చేపట్టిన కూల్చివేతలు, ప్రస్తుతం జరుగుతున్నట్లు చెబుతున్న నిర్మాణాలపై వార్త సంధ్య ప్రచురించిన ప్రత్యేక కథనానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై తాను స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు. భూమి ప్రస్తుత స్థితి, అక్కడ కొనసాగుతున్న నిర్మాణాలు, గతంలో రెవెన్యూ శాఖ చేపట్టిన చర్యలు, భూమికి సంబంధించిన రికార్డులు తదితర అంశాలను పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారిస్తామని పేర్కొన్నారు.

అదే సమయంలో ప్రస్తుతం బేస్‌మెంట్లు, గదులు నిర్మిస్తున్నారన్న ఆరోపణలపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని ఆర్‌ఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భూమి ప్రభుత్వ భూమా, అసైన్డ్‌ భూమా, లేక వ్యక్తిగత హక్కులకు సంబంధించిన భూమా అన్నది అధికారిక రికార్డుల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందని, పరిశీలన అనంతరం అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.

ఆర్‌ఐ స్పందనతో ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం దృష్టి పడినప్పటికీ, గతంలో నిర్మాణాలను తొలగించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసిన ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు ఎలా ప్రారంభమయ్యాయన్న ప్రశ్నకు మాత్రం క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా సర్వే నంబర్లు 499, 500లో భూమి వాస్తవ స్థితి, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు, ప్లాట్ల విక్రయాల ఆరోపణలు, నోటరీ పత్రాల చెల్లుబాటు వంటి అంశాలపై అధికారులు తీసుకునే నిర్ణయంపై స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

ప్రభుత్వ భూములకు కాపలాదారులెవరు?

ప్రభుత్వ భూమి అంటే ప్రజల ఆస్తి. అసైన్డ్‌ భూమి అంటే ప్రభుత్వ విధానాల ద్వారా నిర్దిష్ట లబ్ధిదారులకు కేటాయించిన భూమి. అలాంటి భూములు అక్రమంగా చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వస్తే వాటిని కేవలం స్థానిక వివాదంగా పరిగణించడం కంటే రికార్డుల స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

సర్వే నంబర్లు 499, 500తో పాటు జవహర్‌నగర్‌ పరిసరాల్లోని ప్రభుత్వ, అసైన్డ్‌ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి.. భూముల ప్రస్తుత స్థితి, ఆక్రమణలు, నిర్మాణాలు, విక్రయాలు, పత్రాల చెల్లుబాటు వంటి అంశాలను అధికార యంత్రాంగం బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

మొన్న కూల్చివేతలు.. నేడు బేస్‌మెంట్లు.. మధ్యలో నోటరీ పత్రాలు.. కోట్ల విలువైన భూములు.. సామాన్యుల చేతుల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది  .. ఇవన్నీ కలిపి చూస్తే జవహర్‌నగర్‌ భూ వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరం అని స్పష్టమవుతోంది. అసలు భూమి ఎవరిది? పత్రాలు ఎలా వచ్చాయి? ప్లాట్లు ఎవరు విక్రయిస్తున్నారు? నిర్మాణాలకు ఎవరు అండగా నిలుస్తున్నారు? ప్రభుత్వ భూమి అయితే మళ్లీ ఆక్రమణలు ఎలా మొదలయ్యాయి? ఈ దందాలో అసలు పాత్రధారులు ఎవరు.. సూత్రధారి ఎవరు..? అన్న ప్రశ్నలకు అధికారిక రికార్డులే తుది సమాధానం చెప్పాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!