అనుమతులు జీ ప్లస్ టూ.. నిర్మాణాలు జీ ప్లస్ ఫోర్, జీ ప్లస్ సిక్స్!
నోటీసులు ఇస్తున్నారు.. చర్యలు మాత్రం శూన్యం?
పత్రిక కథనాలతో కదిలిన అధికారులు.. ఇకనైనా కఠిన చర్యలు ఉంటాయా?
ఆదిభట్ల, సెప్టెంబర్ 27 వార్త సంధ్య :
ఆదిభట్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వరుసగా వినిపిస్తున్నాయి. భవన నిర్మాణాలకు ఒక స్థాయి వరకు అనుమతులు తీసుకుని, ఆ తర్వాత అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు జీ ప్లస్ టూ వరకు ఉంటే.. నిర్మాణాలు మాత్రం జీ ప్లస్ ఫోర్, జీ ప్లస్ సిక్స్ వరకు కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
భవన నిర్మాణ నిబంధనల ప్రకారం అనుమతించిన ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అనుమతులకు భిన్నంగా అదనపు అంతస్తులు నిర్మిస్తే సంబంధిత అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆదిభట్ల పరిధిలో కొందరు నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, అధికారుల చర్యలు నోటీసులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నోటీసులతోనే సరిపెడుతున్నారా?
అక్రమ నిర్మాణాలను గుర్తించిన అనంతరం సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, ఆ తర్వాతి దశలో కఠిన చర్యలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగితే వాటిని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితిని కొందరు నిర్మాణదారులు తమకు అనుకూలంగా భావించి నిర్మాణాలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పత్రిక కథనాలతో అధికారుల్లో కదలిక..?
ఆదిభట్ల పరిధిలో అక్రమ నిర్మాణాలపై వరుసగా వెలువడుతున్న వార్తా కథనాలు అధికారుల దృష్టికి వెళ్లడంతో సంబంధిత విభాగం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు కేవలం నోటీసులు, హెచ్చరికలకే పరిమితమైన వ్యవహారం ఇక ఏ దిశగా వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే అధికారులు చేపట్టే చర్యలు కేవలం నిర్మాణాలకు బొక్కలు పెట్టడం, కొంత భాగం తొలగించడం వరకే పరిమితమవుతాయా? లేక అనుమతులకు పూర్తిగా విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులు, అక్రమ నిర్మాణాలను నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో తొలగిస్తారా? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు అందరికీ సమానమేనా?
అనుమతులు తీసుకున్న మేరకే నిర్మాణాలు జరగాలన్నది ప్రభుత్వ నిబంధనల ఉద్దేశం. ఒకరికి నిబంధనలు వర్తించి, మరొకరికి మినహాయింపులు లభిస్తే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ఆదిభట్ల పరిధిలో అనుమతులకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై సమగ్ర పరిశీలన జరిపి, వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఇక అధికారుల తాజా చర్యలు ఎంతవరకు కొనసాగుతాయి? నోటీసులు జారీ చేసిన నిర్మాణాలపై తదుపరి చర్యలు ఏమిటి? అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తుల విషయంలో నిబంధనల ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటారు? అధికారుల చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. పత్రిక కథనాలకు స్పందించిన అధికారులు ఈ వ్యవహారంలో చివరి వరకు చర్యలు కొనసాగిస్తారా, లేక మళ్లీ నోటీసులకే పరిమితమవుతారా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

