33 నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు… ఇప్పుడు రూ.300 కోట్లు ఎలా ఇస్తారు?: బొంగు వెంకటేష్ గౌడ్
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 16 (వార్త సంధ్య): రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ (బీసీపీఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదని ఆయన ఆరోపించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అకస్మాత్తుగా రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నత విద్య పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత చదువుల అవకాశాలను కోల్పోతున్నారని అన్నారు.అధికారంలోకి రాకముందు విద్యార్థులకు అండగా ఉంటామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలను పేరుకుపోయేలా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని బొంగు వెంకటేష్ గౌడ్ మండిపడ్డారు.
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యా వ్యవస్థలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బొంగు వెంకటేష్ గౌడ్ స్పష్టం చేశారు.

