-
ఉద్యోగుల ఆగ్రహం ఉవ్వెత్తున – టీజీఈజేఏసీ ఆందోళన ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (వార్త సంధ్య):
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు రోజురోజుకూ తీవ్రతరమవుతుండగా, ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ (టీజీఈజేఏసీ) మే 5న ఒకరోజు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది.దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం బుధవారం కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో టీజీఈజేఏసీ చైర్మన్ అమరనేని రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఐడిఓసి ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పీఆర్‌సీ అమలు, ఐదు డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు వంటి ప్రధాన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.అలాగే పెన్షనర్లకు సంబంధించిన బకాయిలు, పెన్షనరీ బెనిఫిట్స్ తక్షణం చెల్లించాలని కోరారు. హెల్త్ కార్డుల అమలు, పీఎఫ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు దాదాపు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు.
ఇక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 64 డిమాండ్ల మెమొరాండంపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

